Wednesday, 31 July 2013

Capital City for Royal Andhra

రాజధాని రగడ

August 01, 2013

హైదరాబాద్, జూలై 31: ఒకవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతుండగానే... మరోవైపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ప్రాంత నేతల్లో చర్చలు మొదలయ్యాయి. అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకులు దీనిపై దృష్టిసారించారు. 'అప్పుడు కర్నూలు రాజధానిని కోల్పోయాం. త్యాగాలు చేశాం. ఇప్పుడు మా ప్రాంతానికే రాజధాని కావాలి' అని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. అయితే... విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందనే దిశగా ఆ ప్రాంత నేతలు పావులు కదుపుతున్నారు.

'ఆంధ్రప్రదేశ్' కొత్త రాజధాని అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పాలనాపరమైన కేంద్రంగానే కాకుండా ప్రజలు, పరిశ్రమలు, ఇతరత్రా రంగాలకు చెందిన భవిష్యత్ అవసరాలను కూడా తీర్చాల్సిన స్థాయి ఆ నగరానికి ఉండాలి. సీమాంధ్రలో అలాంటి పెద్దనగరాల జాబితా చూస్తే... మొట్టమొదట స్ఫురణకు వచ్చేది విశాఖ. అయితే...ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం... ఈ మూల ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లా వాసులకు సుదూర తీరమే అవుతుంది. పోనీ... తిరుపతిని చేద్దామంటే శ్రీకాకుళం వాళ్లకు బాగా దూరం. మధ్యస్థంగా విజయవాడను ఎంపిక చేద్దామంటే... ప్రభుత్వ భూమి సెంటు కూడా దొరకదు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. భూసేకరణ అతిపెద్ద సమస్యగా మారుతుంది.

ఇదీ సీమ వాదన
మద్రాసు నుంచి విడిపోయినప్పటి నుంచి రెండుసార్లు రాజధాని విషయంలో తీవ్రంగా నష్టపోయామని...కొత్తరాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సీమ నాయకులు పట్టుబడుతున్నారు. మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, అహ్మదుల్లాతోపాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు 15 మంది దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. రాజధానికి అవసరమైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయం, ఇతరత్రా మౌలిక సదుపాయాలు తిరుపతిలో ఉన్నాయన్నది వీరి అభిప్రాయం. లేదంటే కోస్తాంధ్ర, సీమకు మధ్యస్థంగా ఉండే ప్రకాశం జిల్లాలోనైనా రాజధాని ఏర్పాటుకు కొంత సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చుననే వాదన ఎప్పటి నుంచో ఉంది. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు... పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రాయలసీమకు రాజధాని ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలో విశ్వవిద్యాలయం నెలకొల్పారు. కర్నూలును రాజధాని చేసేందుకు ఇరు ప్రాంతాల నాయకులు అంగీకరించారు. ఆ తర్వాత ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ నాయకుల డిమాండ్ మేరకు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తరలించాల్సి వచ్చింది. అప్పటికే అన్ని రకాల సౌకర్యాలున్న హైదరాబాద్‌ను రాజధాని చేసేందుకు ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలకు చెందిన నాయకులు ఒప్పందం చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పుడు సీమ వాసులకు రాజధాని గురించి ఆందోళన మొదలైంది.
బెజవాడ బెటర్
గుంటూరు - విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేసేలా ఆ ప్రాంత ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాల పరంగా అత్యుత్తమమైనదని... అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఐతే, అన్ని ప్రాంతాల వారూ రాజధానిని కోరుకోవడం సహజమేనని, దీనిపై నిపుణుల కమిటీయే తేల్చాలని కొందరు సూచిస్తున్నారు. ఇరు ప్రాంత నేతలు కూర్చొని మాట్లాడుకుని అంగీకారానికి రావాలని చెబుతున్నారు. "ఇందులో కేంద్రం జోక్యానికి అవకాశం ఉండదు. ఇరు ప్రాంతాలకు అనువైన ప్రాంతాన్ని వారే ఎంపిక చేసుకుని రాజధాని ఏర్పాటుకు అంతా సహకరించాల్సి ఉంటుంది'' అని పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment