Sunday, 14 February 2016

వృద్ధిబాటలో ఉన్నది మనమే

వృద్ధిబాటలో ఉన్నది మనమే

Sakshi | Updated: February 15, 2016 00:48 (IST)
వృద్ధిబాటలో ఉన్నది మనమే
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా భారత్‌లో వేగంగా అభివృద్ధి

♦ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇవే చెబుతున్నాయి
♦ దయానంద్ సరస్వతి జయంతి కార్యక్రమంలో మోదీ

 న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే  భారత్ మాత్రమే తమ ప్రభుత్వ విధానాల కారణంగానే అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకెళ్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సహా అందరూ ఇదే చెబుతున్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే కేవలం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పెద్ద ఆర్థిక దేశాల్లోకెల్లా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా నిలిచినట్లు ప్రపంచ దేశాల ప్రజలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.

1875లో ఆర్య సమాజ్‌ను స్థాపించిన స్వామి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ముద్ర పథకం ద్వారా 2 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందారని, రూ. లక్ష కోట్లకుపైగా ఆర్థిక తోడ్పాటు అందించామన్నారు. 21వ శతాబ్దం విజ్ఞాన శకమని...విజ్ఞాన రంగంలో భారత్ యావత్ ప్రపంచానికి సారథ్యం వహించిందని గుర్తుచేశారు.  దేశంలో ప్రస్తుతం ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం ఉండగా తాము వ్యక్తిగత రంగాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఉద్యోగాలు కోరుకునే వారిలా కాకుండా ఉద్యోగాలిచ్చేలా ఎదిగేందుకు స్వీయ సమృద్ధి, స్వీయ ఉపాధి సాధించాలన్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని...అందువల్ల దేశాభివృద్ధికి యువత శక్తిని ఉపయోగించుకోవడంపై దృష్టిసారించామన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టి దాని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని తెలిపారు.

సీఎం - పీఎం దోస్తీ కుదిరింది

సీఎం - పీఎం దోస్తీ కుదిరింది

Sakshi | Updated: February 15, 2016 03:01 (IST)
సీఎం - పీఎం దోస్తీ కుదిరింది
► త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి టీఆర్‌ఎస్
► ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్లతో సీఎం కేసీఆర్ చర్చలు ఫలప్రదం
► కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీఆర్‌ఎస్‌కు రెండు బెర్త్‌లు
► ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కోరిన టీఆర్‌ఎస్ అధినేత
► ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని సుముఖం
► పదవులు ఆశిస్తున్న కేకే, జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత
► జితేందర్‌రెడ్డి, కవితకు అవకాశం లభించవచ్చంటున్న పార్టీ వర్గాలు
► టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరితే రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ దోస్తీ కటీఫ్


సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరడం దాదాపుగా ఖాయమైంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఈ అంశంపైనే ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయంతో పాటు వివిధ పథకాలకు నిధులు కేటాయించాలంటూ ప్రధాని, ఇతర సీనియర్ మంత్రులను కలిసిన సీఎం.. పనిలో పనిగా ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరే అంశంపైనా చర్చలు జరిపారు.

 కేంద్రంలో చేరితే తమకు ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు కావాలని కోరారు. ప్రస్తుతానికి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆదివారం ఉదయమే బీజేపీ సీనియర్ నేత ఒకరు సీఎంను కలిసి ఈ మేరకు చెప్పినట్టు తెలిసింది. తదుపరి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని, పరిస్థితిని బట్టి ఆ తర్వాత మరొకరికి అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తారని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు విశ్వనగరంగా హైదరాబాద్‌కు అవసరమైన సహకారాన్ని అందించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. సీఎంకు సూచించారు.

 పదవుల కోసం అప్పుడే పోటాపోటీ
 కేంద్రంలో టీఆర్‌ఎస్ చేర డం దాదాపు ఖాయం కావడంతో మంత్రి పదవులకు పార్టీలో అప్పుడే పోటీ మొదలైంది. సీనియర్ పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌తోపాటు నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ పడుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. కేబినెట్ పదవికి రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పోటీ పడుతున్నారు.

 ఒకవేళ కేబినెట్ పదవి రాకపోయినా సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వాలని జితేందర్‌రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కచ్చితంగా ఒకరికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అదే జరిగితే జితేందర్‌రెడ్డికి కేబినెట్ పదవి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇక సహాయ మంత్రి పదవికి కవిత పేరు దాదాపుగా ఖాయమైంది. కేబినెట్ పదవికి ఎవరన్నది సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

 రాష్ట్రంలో బీజేపీకి రెండు పదవులు
 కేంద్ర మంత్రివర్గంలో టీఆర్‌ఎస్ చేరిన మరుక్షణం రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కొత్త రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు తప్పనిసరి అని సీఎం భావిస్తున్నారు. ‘‘మేం కేంద్రంలో చేరడానికి ప్రధానంగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం.

 సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అవసరం’’ అని ప్రధాని సహా కీలక నేతలతో సీఎం అన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 50 శాతం నిధులు కేటాయించాలని సీఎం ఢిల్లీ పర్యటనలో మొదటి రోజున ప్రధానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పూర్తి కావాలంటే ఈ ప్రాజెక్టు కార్యాచరణ పూర్తి కావాల్సిందే. వీటన్నీటిని దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్ కేంద్రంలో చేరాలన్న నిర్ణయం తీసుకుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు ఏపీకే పరిమితం
బీజేపీతో సఖ్యత కుదిరి టీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరితో తెలంగాణలో టీడీపీతో పొత్తు కటీఫ్ అయినట్టే. ఆ పార్టీ తో పొత్తు ఏపీకే ఉంటుందని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘‘ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలో చర్చలు జరిగాయి. బహుశా త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చు’’ అని ఢిల్లీలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

Friday, 12 February 2016

విభజన చేసినవారు తలదించుకునేలా రాష్ట్రాభివృద్ధి చేస్తా

పాలన ప్రైవేటీకరించం
13-02-2016 01:41:27

  • మహిళా ఉద్యోగులకు 60 రోజుల చైల్డ్‌కేర్‌ లీవు
  • బందరు, శ్రీకాకుళం, చిత్తూరుల్లో 20ు హెచ్‌ఆర్‌ఏ
  • ఫైళ్లన్నీ ఈ- ఆఫీసే.. సంస్కరణలతో పనిభారం తగ్గిస్తా
  • సంక్షోభాల్లో ఉద్యోగులు సర్కార్‌కు అండగా ఉన్నారు
  • విభజన చేసినవారు తలదించుకునేలా రాషా్ట్రభివృద్ధి
  • ఉద్యోగులపై చంద్రబాబు ప్రశంసలు.. వరాల జల్లు
  • విభజన తొలి బాధితుడిని తానేనని వ్యాఖ్య
  • శ్రీకాకుళంలో ఘనంగా ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభలు
  • ఉద్యోగులకు అండగా ఉంటాం: చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం వరాలజల్లు కురిపించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్‌ కింద 60 రోజులు సెలవులు, జిల్లా కేంద్రాలైన శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నంల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పాలనను ప్రైవేటీకరించబోనని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏపీ ఎన్జీవోల 19వ రాష్ట్రస్థాయి మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఎన్జీవోల డిమాండ్లను సావధానంగా ఆలకించిన చంద్రబాబు అనంతరం సభలో మాట్లాడుతూ.. ఉద్యోగులపై వరాలజల్లు కురిపించారు. ప్రభుత్వశాఖల్లో పాలనాసంస్కరణలను ప్రవేశపెట్టి ఉద్యోగులపై పనిభారం తగ్గిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగులు రొటీనగా పని చేయవద్దని, ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగులంతా ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా ఫైళ్లు పంపాలని సూచించారు. ప్రభుత్వశాఖల్లో పనితీరు ఏవిధంగా ఉండాలనే దానిపై పరిపాలన సంస్కరణల కమిటీ సూచనల ద్వారా పనిభారం తగ్గిస్తామన్నారు. ‘మీరు భ్రమపడినట్లు పరిపాలనను నేను ప్రైవేటీకరించబోను. ఉద్యోగులు.. ప్రభుత్వం కలిసి అవినీతిని పరిష్కరించే బాధ్యత తీసుకుందాం. మీరు గట్టిగా పనిచేస్తే మీ అందరిని అన్ని విధాలుగా ఆదుకుంటాను. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయం గురించి ఆలోచిస్తా. ఒకేసారి అన్నీ చేయలేం. ప్రభుత్వ ఉద్యోగులకు అన్నీ చేస్తా. వెసులుబాటు ఉంటే ఏమాత్రం వెనక్కిపోను. ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధించి కసరత్తు చేస్తోంది. ఇందులో మీరు కూడా కొత్త ఆలోచనలతో భాగస్వామ్యం కావాలి. ఏ శాఖలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి’ అని సీఎం కోరారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను అధిగమించడంలోను, విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు, ఐఎ్‌ఫఆర్‌ విజయవంతంలోను, హుద్‌హుద్‌ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ వారు ప్రభుత్వానికి అండగా ఉన్నారని ప్రశంసించారు.
 
విభజించుకునేవాళ్లు తలదించుకునేలా అభివృద్ధి
‘రాష్ట్ర విభజనను ఇష్టానుసారం చేశారు. ఇప్పటికీ రాజధాని లేక ఇబ్బందులు పడుతున్నాం. కొందరు ఉద్యోగులు హైదరాబాద్‌లో పనిచేస్తుంటే నేనేమో విజయవాడ నుంచి పనిచేస్తున్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి, విభజన చేసినవారు తలదించుకునేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
 
పరిశ్రమలు, పోర్టులు వద్దంటే ఎలా?
‘పరిశ్రమలు, కొత్త పోర్టుల రాకతోనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. కాని ఇక్కడేమో పోర్టులు, పరిశ్రమలు వద్దంటున్నారు. ఇలా అయితే ప్రగతి ఎలా సాధ్యమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణమైతే ఈ జిల్లా దశ మారిపోతుంది. విశాఖపట్నం, కాకినాడల్లో పోర్టులు ఉండటం వల్లే ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
 
తొలి బాధితుడిని నేనే : చంద్రబాబు
రాష్ట్ర విభజన తొలి బాధితుడిని తానేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాను విజయవాడలో పనిచేస్తుంటే తన మనవడు హైదరాబాద్‌లో ఉంటున్నాడని, దీంతో మనవడితో గడిపేందుకు సమయం దొరకడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీవోల రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన సీఎం విభజన సమయంలో ఉద్యోగుల పోరాటాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకచోట పనిచేస్తుంటే, తాను విజయవాడ నుంచి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. దీంతో కుటుంబంతో ముఖ్యంగా తన మనవడితో గడిపేందుకు సమయం దొరకడం లేదంటూ వ్యాఖ్యానించారు.

మురిగిపోతున్న చంద్రన్న ‘కానుకలు’

మురిగిపోతున్న చంద్రన్న ‘కానుకలు’ 
13-02-2016 11:31:48

  • మిగిలిన పోయిన 46 వేల సంచులు 
  • వసతి గృహాలకు చేర్చాలని ప్రభుత్వ ఆదేశాలు 
  • పట్టించుకోని పౌరసరఫరాల అధికారులు 
  • డీలర్ల వద్దనే చంద్రన్న సంక్రాంతి సరుకులు 
  • ఇప్పటికే కొన్ని వస్తువులు మాయం 

ఒంగోలు నగరం: ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ సరుకులు డీలర్ల వద్దనే మురిగి పోతున్నాయి. మిగిలి పోయిన సరుకులను సంక్షేమ వసతి గృహాలకు చేర్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నెల రోజులు కావస్తోంది. అయినా నేటికీ వాటిని వసతి గృహాలకు చేర్చటంలో పౌరసరఫరాలశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అసలే నాసిరకం సరుకులను చంద్రన్న సంక్రాంతి కానుల కింద కాంట్రాక్టర్‌ సరఫరా చేశారు. వీటిని ప్రభుత్వం డిసెంబర్‌లో క్రిస్మస్‌కు, జనవరిలో సంక్రాంతి పండుగకు పంపిణీ చేశారు. జిల్లాలో 9,29,170 తెల్లకార్డులు ఉన్నాయి. వీటికి చంద్రన్న కానుక పేరుతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. వాటిల్లో కేజీ గోధుమ పిండి, అర లీటర్‌ పామాయిల్‌, 100 గ్రాముల నెయ్యి, శనగపప్పు, కందిపప్పు, బెల్లం అర కేజీ చొప్పున ప్యాకెట్లు చేసి ప్రత్యేకంగా రూపొందించిన సంచుల్లో ఉంచి పంపిణీ చేశారు. టెండర్‌దారుడు ఈ సంచులను డిసెంబర్‌, జనవరి నెలల్లో పంపిణీ చేశారు. పంపిణీ సమయంలోనే ఈ సరుకులపై విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులు నాసిరకంగా ఉన్నాయంటూ కార్డుదారులు గగ్గోలు పెట్టారు. బెల్లం నీరుగారి పోయి వాసన వస్తున్నా అధికారులు అలాగే పంపిణీ చేశారు.
 
             అయితే కానుక కింద పంపిణీ చేసిన సంచుల్లో 46 వేల సంచులు మిగిలి పోయాయి. మిగిలిన ఈ సరుకులను జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో మిగిలిన చంద్రన్న కానుక సరుకులను అప్పుడే వసతి గృహాలకు అందజేశారు. జిల్లాలో ఇంత వరకు వాటిని వసతి గృహాలకు అందజేయలేదు. అసలు ఆ సరుకుల సంచులు ఇంత వరకు డీలర్ల వద్ద నుంచి సమీప ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరనేలేదు. డీలర్లు ఈ సంచులను మూలన పడేశారు. వాటిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దకు చేర్చి అక్కడ నుంచి సమీపంలోని వసతి గృహాలకు చేర్చాల్సి ఉండగా పౌరసరఫరాలశాఖ అధికారులు ఇంత వరకు వాటిని ఇప్పటికీ డీలర్ల వద్దనే ఉంచి కాలయాపన చేస్తున్నారు. డీలర్లు ఈ సంచుల్లో ఉన్న వాటిలో కొన్నింటిని మాయం చేసి బ్లాక్‌ తరలించగా కొన్ని వస్తువుల పాడై పోయాయి. ఈ సరుకులను ప్యాక్‌ చేసి ఇప్పటికి రెండు నెలలు కావస్తోంది.
 
            ఇంత కాలం స్టాక్‌ పెట్టటం వలన వస్తువులు పాడై పోవటం ఖాయమని తెలిసినా వాటిని ఇంత వరకు వసతి గృహాలకు చేర్చకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పంపిణీకి సంబంధించి రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార తనిఖీ విభాగం అధికారులు పరిశీలించిన తర్వాతే వాటిని వసతి గృహాలకు చేర్చండి అంటూ ఆయన పౌరసరఫరాలశాఖ అధికారులకు సూచించారు. అయినా వారిలో స్పందన లేదు. పూర్తిగా పాడైన తర్వాతే వాటిని వసతి గృహాలకు అందజేస్తాం అన్నట్లుగా అధికారుల తీరు ఉంది.

Thursday, 11 February 2016

వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేద్దాం..

వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేద్దాం..
12-02-2016 10:28:02

  • ఎమ్మెల్యే జలీల్‌కు లైన్ క్లియర్‌
  • టీడీపీతో టచలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి
  • నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ చూపు కూడా!
  • పరోక్షంగా, ప్రత్యక్షంగా టీడీపీతో సంబంధాలు
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుంటే... ఆంధ్రాలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపని టీడీపీ తెలంగాణలో పరిస్థితి చూశాక రూటు మార్చుకొన్నట్టు కనిపిస్తోంది. అధికారంలో వున్న పార్టీలోకి వలసలు పెద్ద విషయం ఏమీ కాదని, ఆంధ్రాలో తమకు అంతకంటే ఎక్కువ స్పందనే వుందని టీఆర్‌ఎస్‌కు బదులిచ్చేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అందుకు తొలిగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లా నుంచే శ్రీకారం చుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- విజయవాడ) 

టీడీపీలోకి వలసల పర్వానికి పార్టీ నేతలు మంచి ముహూర్త బలం కోసం వెదుకుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలలో వున్నారన్న ప్రచారం వుంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుల పేర్లు ఈ క్రమంలో వినిపించాయి. వీరిలో జలీల్‌ఖాన ఒక్కరే అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కలసిన ప్రతిసారీ తన నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించే సీఎంను కలిశాను తప్ప ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతూ వచ్చారు. తాజాగా గురువారం మంత్రి దేవినేని ఉమాతో కలసి మరీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాత్రం యధావిధిగా తన నియోజకవర్గంలో షాదీఖానా శంకుస్ధాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్లానని చెప్పారు. అయితే జలీల్‌ ముఖ్యమంత్రితో భేటీ అవడానికి వెనుక బలమైన కారణం వున్నట్టు తెలిసింది. 
 
           పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... జలీల్‌ఖాన పార్టీలో చేరడానికి లైన క్లియర్‌ అయింది. పెద్ద షరతులు ఏమీ లేకుండానే ఆయన టీడీపీలో చేరనున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీలో చేరడానికి కొన్ని షరతులు పెడుతూ వచ్చారు. మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు కనుక తనకు మంత్రి పదవి ఇచ్చి ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖను ఇస్తే పార్టీలో చేరతానని మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపారు. దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గ సీటు వచ్చే ఎన్నికలలో తనకు ఇస్తానని మంత్రి దేవినేని ఉమా, ఎంపి కేశినేని నానిల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని గతంలో వేసిన భేటీలలో జలీల్‌ కోరారు. విజయవాడ పశ్చిమ సీటు జలీల్‌కు ఇవ్వడం వరకు ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మిగిలిన వాటిపై స్పష్టత ఇవ్వలేదు. టీడీపీలో చేరాలన్న తలంపుతో వున్న జలీల్‌ను, జిల్లా మంత్రి ఒకరు బుధవారం నగరానికి వచ్చిన టీడీపీ జనరల్‌ సెక్రటరీ లోకేష్‌తో కూర్చోపెట్టి మాట్లాడించినట్టు తెలిసింది. అక్కడ కూడా జలీల్‌ తనకు మంత్రి పదవి కాని మైనారిటీ కార్పొరేషన చైర్మన పదవి కాని ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే లోకేష్‌ వీటి గురించి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడమని సూచించినట్టు తెలుస్తోంది. గురువారం చంద్రబాబును కలిసిన జలీల్‌ఖాన రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. ప్రాథమికంగా ముందు పార్టీలోకి హాజరు కావాల్సిందిగా జలీల్‌ను ఆహ్వానించినట్టు ఆయన వర్గీయులు చె బుతున్నారు. సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు కూడా చెప్పినట్టు సమాచారం. ఇదే సందర్భంలో మెడలో కండువా కూడా వేయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే బయటకు వచ్చిన తర్వాత కండువా ఏమీ కనిపించలేదు. ఆయన అనుచరులు త్వరలోనే ఆయన టీడీపీలోకి అధికారికంగా చేరటం ఖాయమని చెబుతున్నారు. అప్పుడే చేరలేదని, తొందరేముందంటూ భేటీ అనంతరం జలీల్‌ వ్యాఖ్యానించటం గమనార్హం.
 
టచ్‌లో ఉంటున్న వైసీసీ ఎమ్మెల్యేలు
జలీల్‌ఖానతో పాటు జిల్లా నుంచి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్యనేతలు, అధినేతతోనూ టచలో ఉంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కాస్త అడ్వాన్సుగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారనడానికి కొద్ది కాలం కిందట విజయవాడలో జరిగిన టాటా ట్రస్ట్‌ సదస్సు గురించి చెప్పుకోవాలి. కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలను టాటా ట్రస్ట్‌ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆరోజు సమావేశం జరిగింది. కార్యక్రమంలో రతన టాటా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణనిధి పాల్గొన్నారు. తన సొంత కార్యక్రమంగా ఫీలయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు ఆయన కూడా ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. వేదికపైకి వచ్చి భారీ పుష్పగుచ్చాన్ని ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు. టీడీపీ నేతలతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు. కార్యక్రమం తన సొంతదిలా ఫీలయ్యారు. అప్పుడే రక్షణ నిధి తీరుపై అనుమానాలు కలిగాయి. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు బహిరంగంగా బయట పడకపోయినా, అంతర్గతంగా నేతలతో టచలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి ఎమ్మెల్యేల వర్గీయులు వీటిపై కాదని ఖండించకపోయినా.. స్తబ్దుగా ఉండటం గమనార్హం .

Wednesday, 10 February 2016

చిరుత కలకలం.. 134 స్కూళ్లకు సెలవు

చిరుత కలకలం.. 134 స్కూళ్లకు సెలవు

Others | Updated: February 11, 2016 11:20 (IST)
చిరుత కలకలం.. 134 స్కూళ్లకు సెలవు
బెంగళూరు:  బెంగళూరులో చిరుతపులులు సంచరిస్తుండటంతో నగరంలోని 134 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బుధవారం నాడు 60 స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ గురువారం వాటి సంఖ్యను రెట్టింపు చేసింది. వారం రోజుల కిందట స్కూల్లోకి ఓ చిరుత వచ్చి నానా హడావుడి చేసి చివరకు తోక ముడిచి వెళ్లిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది కదూ. మరోసారి కూడా సరిగ్గా మళ్లీ అదే స్కూల్లోకి మరో చిరుత మంగళవారం ప్రవేశించింది. స్థానికులు మాత్రం తాము రెండు చిరుతలను చూసినట్లు చెబుతున్నారని అటవీ శాఖాధికారి ఒకరు వెల్లడించారు.

వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ఏరియాల్లోని అన్ని పాఠశాలలను మూసివేశారు. మంగళవారం చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్తలతో బుధవారం నాడు కొన్ని ఏరియాల్లో స్కూళ్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. పులులు ఉన్నాయని చెప్పడానికి తమ వద్ద రుజువులు లేనవి  ప్రిన్సిపాల్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ రవి రాల్ఫ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని, చిరుతల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే పట్టుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విబ్జ్‌యార్ స్కూల్లోకి ఈనెల 7వ తేదీన ఒక చిరుత ప్రవేశించి, అటవీ శాఖాధికారులను గాయపరిచిన విషయం తెలిసిందే. మొత్తానికి బెంగళూరు వాసులు చిరుత సంచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను ఉరితీసిన ఉత్తర కొరియా Korea Ganged Army Chief

ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను ఉరితీసిన ఉత్తర కొరియా

Sakshi | Updated: February 11, 2016 09:00 (IST)
ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను ఉరితీసిన ఉత్తర కొరియా
వెల్లడించిన దక్షిణ కొరియా మీడియా

 సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ) జనరల్ స్టాఫ్ చీఫ్ రి యోంగ్ గిల్‌ను ఉరి తీసినట్టు దక్షిణ కొరియా మీడియా బుధవారం వెల్లడించింది. అవినీతి, రాజకీయ కుట్రకు పాల్పడ్డ అభియోగంపై ఆయనకీ శిక్ష విధించినట్టు యోన్‌హాప్ వార్తా సంస్థ ప్రకటించింది.

ప్రపంచ దేశాలన్నీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పెడచెవిన పెట్టి ఇటీవల ఉత్తర కొరియా జరిపిన అణు పరీక్ష, ఉపరితల క్షిపణి ప్రయోగాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఉదంతం ఆందోళన రేకెత్తిస్తోంది. కిమ్ పర్యటనల్లో తరచుగా కనిపించే రి యోంగ్ ఇటీవల కనుమరుగయ్యారు.  శక్తివంతమైన దేశ ఆర్మీపై పూర్తి ఆధిపత్యం దక్కించుకోవాలన్న క్రమంలోనే ఈ మరణ శిక్ష అమలు చేసినట్టు ఉత్తర కొరియా వర్గాల సమాచారమని వార్తా సంస్థ పేర్కొంది.