Wednesday 2 April 2014

ఉత్తమాంధ్ర కావాలి!

ఉత్తమాంధ్ర కావాలి!

Published at: 02-04-2014 07:48 AM
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర... సామాజిక, ఆర్థిక ప్రమాణాల దృష్ట్యా అత్యంత వెనకబడిన ప్రాంతం. అభివృద్ధికి అనేక యోజనాల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రగతికి ఉమ్మడి రాష్ట్రంలో ఏలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రను 'ఉత్త ఆంధ్ర'గా ప్రస్తావించే సామెత ఒకటి తెలుగులో ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని చక్కగా ఉపయోగించుకుంటే ఉత్త ఆంధ్రాను కాస్తా 'ఉత్తమ ఆంధ్ర'గా మార్చవచ్చు. ఉత్తరాంధ్రలో ఒకవైపు తూర్పు కనుమలు, మరోవైపు సముద్ర తీరం, పుష్కలంగా జలవనరులున్న మైదానాలు... మొత్తం మూడు రకాల పర్యావరణ మండలాలున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్తావన రాగానే చాలామంది, ప్రతిపాదనలో ఉన్న విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఈ ప్రాంత భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది. వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖతోనే అంతమైనట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారులు, అభివృద్ధి పథకాల అమలు బాధ్యులు చాలా మంది విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర కేంద్రంగా భావిస్తారు. అయితే, విశాఖ ఆవల మరో రెండున్నర జిల్లాలున్నాయన్న విషయం మర్చిపోకూడదు. విశాఖకు ఎగువన మరో 400 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉంది. అపారమైన ఖనిజ సంపద, సహజ వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తీరప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు అవసరమైన ముడి పదార్థాలు ఇక్కడే లభిస్తాయి. ప్రాచీన మధ్య కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో బౌద్ధారామాలు, మతపరమైన పుణ్యక్షేత్రాలు, అందమైన బీచ్‌లు, పర్యాటకులను ఆకర్షించే ఘాట్స్, అత్యంత అరుదైన వృక్ష, జంతుజాతులున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఉత్తరాంధ్రలో అది మరింత అవసరం. పొట్ట చేతపట్టుకు వలసపోయిన వారిని వెనక్కి రప్పించే విధంగా సమ్మిళిత వృద్ధి విధానాలకు రూపకల్పన జరగాలి. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్సీ, సెంట్రల్ యూనివర్సిటీ, రాజధాని.. విశాఖలో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్రలో చిన్న చిన్న పోర్టులు, జెట్టీలున్నాయి. ఒకప్పుడు తూర్పు ఆసియాతో వాణిజ్యం నెరపిన కేంద్రాలున్నాయి. షిప్పింగ్, టూరిజం కోసం వాటిని రీ డిజైన్ చేయవచ్చు. తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని వనరులను దృష్టిలో ఉంచుకుని ఆగ్రో పరిశ్రమలు, ఐసీటీ, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఎఫ్‌డీఐని ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలి. వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాష్ట్రానికి కల్పించిన రాయితీలను ఉపయోగించుకుని స్థానిక యువకులకే కాకుండా, వలసవెళ్లిన స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. అప్పుడు సమ్మిళిత వృద్ధికి అవకాశం ఉంటుంది. ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనాల వల్ల పేదలు ముఖ్యంగా జాలర్లు, దళితులు, బీసీలు... లాభపడలేదు. వారిని మరింత పరాయిగా మార్చడంతో పాటు మరింత పేదలుగా మార్చింది. ఇదే రాష్ట్ర విభజనకు దారితీసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి మరీ ముఖ్యంగా ఉత్తర కోస్తా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలి.
మిగులు నీళ్లున్నా...
రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతంలో సగం ఉత్తరాంధ్రలోనే ఉంది. అయినప్పటికీ విశాఖపట్నంలోని పాత రేవు తప్ప, చెప్పుకోదగిన మంచి ప్రాజెక్టు ఒక్కటీ తీరప్రాంతంలో కొత్తగా రాలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీటి వనరులకు కొదవలేదు. పరివాహ ప్రాంత హక్కులను చట్టప్రకారం గౌరవిస్తే ఈ ప్రాంతం మిగులు జలాలతో కళకళలాడుతుంది. శబరి, సీలేరు, ఏలేరుపై ఆధారపడిన నదుల మిగుల జలాలపై ఆధారపడే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం తాగునీటి అవసరాలకు మాత్రం ఒక కెనాల్‌ను నిర్మిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలను తీర్చడానికే తప్ప, ఉత్తరాంధ్ర జిల్లాల ఇరిగేషన్ అవసరాలకు పోలవరం ప్రాజెక్టు ఏమాత్రం ఉపయోగపడదు. మరోవైపు, గిరిజనప్రాంతాల్లో సాగుయోగ్యమైన భూమి కొరత ఉంది. అయినప్పటికీ, వందల ఎకరాలు అవసరమైన అనేక ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాల గురించి విధాన నిర్ణేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్త ప్రాజెక్టుల పారిశ్రామిక అవసరాలపైనే వారి శ్రద్ధ అంతా. ఈ వైఖరివల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లో వ్యవసాయ రాబడి కనిష్ఠ స్థాయిల్లో ఉంది.
కాలుష్య పరిశ్రమలకు డంప్‌యార్డ్..
గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతం ప్రమాదకర ఫార్మా, రసాయన పరిశ్రమకు నిలయంగా మారుతోంది. హైదరాబాద్ నుంచి తరిమేసిన కాలుష్యకారక పరిశ్రమలకు విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాలను డంప్‌యార్డ్‌లుగా మారుస్తున్నారు. విశాఖపట్నంలోని సహజమైన ఓడరేవు, గరివిడిలోని ఖనిజ సంపద కారణంగా బ్రిటిష్ ప్రభుత్వమే ఇక్కడ తొలి పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీతో సహా అనేక కర్మాగారాలను ఏర్పాటు చేసింది. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన గత రెండు దశాబ్దాల్లో కాలుష్యకారకమైన థర్మల్ ప్లాంటు, ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం తప్ప ప్రభు త్వం ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదు. విజయనగరం, శ్రీకాకుళంలో సగటు విద్యుత్ వినియోగం ఉమ్మడి రాష్ట్రంలో కనిష్ఠ స్థాయిలో ఉంది. దీనినిబట్టే ఇక్కడి పారిశ్రామిక ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సర్వీసుల రంగం మాత్రమే ఇతర రంగాలతో పోలిస్తే బాగా వృద్ధి చెందింది.
బయటవారే బాగుపడ్డారు..
సాగునీటి లభ్యత, సబ్సిడీతో కూడిన ఇతర ముడిపదార్థాల అందుబాటుతో కోస్తా ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయంలోని మిగులు, విద్యా రంగంపై ఫోకస్‌కు దోహదం చేసింది. దేశంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు అనేకం కోస్తా ప్రాంతాలకు చెందినవారివే కావడం గమనార్హం. ఉత్తర కోస్తాలోని కాలేజీలు కూడా కోస్తాంధ్ర వారివే. కోస్తా ప్రాంతంలో విద్యావ్యాప్తికి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఉపకరించింది. విశ్వవిద్యాలయం, రేవు, కర్మాగారాల కారణంగా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు... వీటివల్ల ఇతర ప్రాంతాల నుంచి సాధారణ ప్రజలు, రాజకీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో విశాఖకు చేరారు. అలాంటి నాయకులే ఇప్పుడు ఉత్తర కోస్తాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖపట్నంలోని అభివృద్ధి, స్థానికుల కంటే బయటవారి అభివృద్ధికే ఎక్కువ దోహదం చేసింది.
భద్రత కావాలి...
ఉత్తరాంధ్ర సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రత్యేకమైంది. ఇక్కడి ప్రజల్లో అత్యధిక శాతం మంది వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు. వీరి జనాభా 85 శాతం ఉంటుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలవారి లోపాయికారి లౌక్యం, దూకుడును తట్టుకుకునేందుకు వారికి ప్రత్యేక భద్రత కావాలి. ప్రధాన రాజకీయ పక్షాల్లో స్థానికులకు ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటున్నది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. సామాజిక అవగాహన, విశాల దృక్ఫథం ఏమాత్రం లేని బయటప్రాంతం వారు ఈ ప్రాంత ప్రతినిధులుగా కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా రావడంతో భీమునిపట్నం ఆవల వినాశనం తప్ప అభివృద్ధి లేకుండా పోయింది.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని భూముల్లో అటవీ, బంజరు భూములు 55 శాతం ఉంటాయి. ఇక్కడి గిరిజన జనాభా ఉమ్మడి రాష్ట్రంలో 15 శాతం ఉంది. సామాజికంగా చూస్తే బయట నుంచి వలసలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇది. ఆఖరుకు తీర ప్రాంతంలోని జాలర్లు కూడా పక్కకు తోయబడ్డారు. మెజార్టీ ప్రజల జీవితాలు ధ్వంసమయ్యాయి. విశాఖపట్నంలో అభివృద్ధి పేరుతో చేపట్టిన పథకాలు స్థానికులను మరింత పక్కకు నెట్టివేశాయి. విధిలేక వారు వలసవెళ్లేలా చేశాయి. ఈ ప్రాంతానికి లభించిన రాయితీలను, ఇతర సౌకర్యాలను బయటవారు తమ స్కిల్స్, మానిప్యులేషన్స్‌తో ఉపయోగించుకుని లబ్ధిపొందారు. ఈ ప్రాంతం నుంచి సుమారు 15 లక్షల మంది హైదరాబాద్ వలసపోయినట్టు చెబుతున్నారు.
-ప్రొఫెసర్ కెఎస్ చలం... ఆర్థిక శాస్త్ర ఆచార్యులు

No comments:

Post a Comment