Tuesday 29 April 2014

కేసీఆర్ నక్సల్ ఎజెండా ఇదేనా?

కేసీఆర్ నక్సల్ ఎజెండా ఇదేనా?

Published at: 29-04-2014 04:33 AM
హౖౖెదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): నక్సల్ అజెండా అమలు చేస్తామన్న కేసీఆర్.. మేనిఫెస్టోలో మిగులు భూముల గురించి ఎందుకు ప్రస్తావించలేదని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ప్రశ్నించింది. ఆదివాసీలను ముంచుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ పార్టీ సహా తెలంగాణలో ఎవరూ మాట్లాడటం లేదని మండిపడింది. విమర్శించింది. 'భూమి, ఖనిజాలు, సహజవాయువు, సముద్రం, ఆకాశాన్ని సైతం అమ్మకానికి పెట్టిన దొంగ నాయకులను తరిమికొట్టండి' అని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఎన్నికలంటే కేవలం పాలకవర్గాల దోపిడీకి ఉపయోగపడే తంతు మాత్రమేనని దుయ్యబట్టింది. మోసపూరిత వాగ్దానాలతో ఓట్లకోసం వస్తున్న పార్టీలు, నాయకులను నమ్మరాదంటూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చంద్రన్న పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల అయింది. "అరవై ఏళ్లుగా ఓట్లేస్తున్న ప్రజలు ఏట్లోకి పోతుంటే పాలకులు మాత్రం దోపిడీలో పోటీపడుతున్నారు. ధ్వజమెత్తారు. కోస్తాంధ్ర పెట్టుబడిదారీ వర్గాలకు తెలంగాణ నేతలు తొత్తులుగా మారారు. వారు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి వీరు రక్షణగా నిలుస్తున్నారు'' అని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్‌లు ప్రపంచబ్యాంకు విధానాలు అవలంబించడం వల్లనే రైతులు పురుగుల మందు తాగారని, సిరిసిల్ల నేత కార్మికులు ఉరేసుకొని అశువులు బాశారని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు పట్టని వారిని తరిమికొట్టాలని చంద్రన్న పిలుపునిచ్చారు.
'కరపత్రా'ల కలకలం!
చింతూరు: సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన మావోయిస్టులు.. తెలంగాణలో పోలింగ్‌కు కొన్ని గంటలు ముందుగా కరపత్రాలతో కలకలం సృష్టించారు. ఛత్తీస్‌గఢ్‌కి సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా చింతూరు మండలం చట్టి నుంచి బుర్కనకోట వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర కరపత్రాలను వదిలారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ తదితర పార్టీలను తరిమికొట్టాలని ఆ కరపత్రాల్లో పిలుపునిచ్చారు. బూర్జువా పార్టీలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరిట లేఖ విడుదల అయింది.

No comments:

Post a Comment