Wednesday, 6 January 2016

‘పెద్దలకు’ ప్రేమతో..!

‘పెద్దలకు’ ప్రేమతో..!

Sakshi | Updated: January 07, 2016 08:31 (IST)
‘పెద్దలకు’ ప్రేమతో..!వీడియోకి క్లిక్ చేయండి
పేదల ‘అసైన్డ్’ భూములను కొల్లగొట్టిన వారికి సర్కారు అండదండ

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయకపోగా ఇప్పుడు పేదలకు చెందిన అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నూతన రాజధానిలో పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదల అసైన్డ్ భూములను మంత్రులు, అధికార పార్టీ నేతలు బలవంతంగా తక్కువ ధరలకు కాజేశారు. ఇప్పుడు ఆ భూములను క్రమబద్ధీకరణ చేసి, చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వ్యూహాత్మకంగా నడిపించారు.

రాజధానిలో మీ భూములు పోతాయని, ప్రభుత్వమే తీసేసుకుంటుందని, పైసా ఇవ్వదంటూ మంత్రులు, అధికార పార్టీ నేతలు పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. రూ.కోట్లు విలువ చేసే భూములను చౌకగా కొనుగోలు చేసి బినామీల పేరు మీద రాయించేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ రాతపత్రాలను, డబ్బులివ్వడాన్ని వీడియోల్లో చిత్రీకరించారు. అలా రాజధాని ప్రాంతంలోని వేల ఎకరాల అసైన్డ్ భూములను తన పార్టీ నేతలతో కొనుగోలు చేయించాక చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసైన్డ్ భూములను విక్రయించుకునే వెసులుబాటు పేదలకు కల్పిస్తున్నామనే ముసుగులో అధికార పార్టీ నేతలకు ఆ భూములపై చట్టబద్ధత కల్పించి రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఏకంగా 1977 అసైన్డ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ చట్టంలో సవరణలకు సవివరమైన ప్రతిపాదనలు అత్యవసరంగా పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం సీసీఎల్‌ఎకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసైన్డ్ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై పూర్తి వివరాలను అందజేయాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు వచ్చిన తరువాత పూర్తి వివరాలతో చట్ట సవరణకు సీసీఎల్‌ఏ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

 పార్టీ నేతల ప్రయోజనం కోసమే...
 వైఎస్ సర్కారు అసైన్డ్ భూముల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు మాత్రం ఆ చట్టం స్పూర్తికే తూట్లు పొడుస్తూ అసైన్డ్ భూములను కొల్లగొట్టిన అధికార పార్టీ పెద్దలకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరిస్తోంది. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలుగా వైఎస్ ప్రభుత్వం 2007- 2008లో అసైన్డ్ చట్టానికి సవరణలు కూడా చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారపార్టీ నేతలకు రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు అసైన్డ్ చట్టానికి సవరణలు చేసి పేదల కడుపులు కొట్టేందుకు సిద్ధమవుతోంది. 1954 ముందే అసైన్డ్ భూముల చట్టం ఉంది. అయితే ఆ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు చేయరాదనే నిబంధన ఏదీ లేదు.

1954 తరువాత అసైన్డ్ భూములను విక్రయించరాదనే నిబంధనను తీసుకువచ్చారు. ఆ తరువాత 1964లో చట్ట సవరణ, 1977 చట్ట సవరణల్లో అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు కూడా చేయరాదనే నిబంధనను విధించారు. కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే నిబంధనను 1977 చట్ట సవరణలో పేర్కొన్నారు. అయినా అధికార పార్టీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యధేచ్ఛగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. అందుకోసం అన్ని రకాల అక్రమాలకూ పాల్పడ్డారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, పరిహారం కూడా ఇవ్వదని రైతులను భయపెట్టారు.

అసైన్డ్ భూములను ఎకరా కేవలం రూ.పది లక్షలకే సొంతం చేసుకున్నారు. భూమిదారులకు ఎలాంటి పత్రాలు లేకపోయినా ఫర్వాలేదంటూ... కేవలం రేషన్‌కార్డు, ఆధార్ కార్డు చూసి భూములు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను ఎలాగైనా రెగ్యులరైజ్ చేయించుకోగలమనే ధీమాతోనే వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేయడం ద్వారా అక్రమంగా కొన్న భూములను సక్రమం చేసి అధికార పార్టీ నేతలకు రూ.కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూర్చేందుకు సర్కారు సన్నాద్ధమవుతోంది.

 రాజధాని నగర పరిధిలో 2,028 ఎకరాలు అసైన్డ్ భూములు
 రాజధాని నగర పరిధిలో దాదాపు 2,028 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాజధాని పరిధిలోని 13 లంకల్లో అన్ని రకాల భూములు కలిపి 2,159.17 ఎకరాలున్నాయి. ఈ మొత్తం 4,187 ఎకరాల్లో అధికభాగం భూములను అధికార పార్టీ నేతలు కారుచౌకగా కొనుగోళ్లు చేశారు. ప్రస్తుత అసైన్డ్ చట్టం ప్రకారం చేతులు మారిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.  కానీ భూములు అధికార పార్టీ నేతల చేతుల్లో ఉండటంతో ప్రభుత్వం అలా చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసినప్పటికీ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రాజధాని నగర పరిధిలో 60 ఎకరాలు మాజీ  సైనికోద్యోగులకు, రాజకీయ సామాజిక బాధితులకు కేటాయించారు. ఆయా భూములను పదేళ్లపాటు అనుభవించిన తరువాత విక్రయించుకునే హక్కులున్నాయి. ఆ భూములకు కూడా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.

 బలహీన వర్గాలకు తీవ్ర నష్టం
 సీసీఎల్‌ఏ వద్ద గత ఏడాదివరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. ఇందులో ఏడు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు, మరో మూడు లక్షల ఎకరాలకు రికార్డులను తేల్చాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ వారికి లబ్ది చేకూర్చేందుకు రెండు జిల్లాల్లో చేస్తున్న సవరణలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే అసైన్డ్ భూములు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బడుగువర్గాల అవసరాలను ఆసరాగా తీసుకుని బలవంతులు అసైన్డ్ భూములు కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ చేయించుకుంటారని, ఫలితంగా బడుగులు శాశ్వతంగా భూమికి దూరమవుతారని హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు పలుకుబడి ఉపయోగించి పేదలకు భూములు మంజూరు చేయించి, ఆ తర్వాత వారే కొనుగోలు చేసే అవకాశాలూ లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 నిరుపేదలకు అన్యాయం..
 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య
 ప్రస్తుత చట్టం 9 ఆఫ్ 1977 అసైన్డ్ చట్టం ప్రకారం ఎవరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదు, విక్రయించరాదు. అసైన్డ్‌దారుల నుంచి ఎవరైనా కొనుగోలు చేసినా చట్ట ప్రకారం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్వాధీనం చేసుకున్న భూములను ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి ఉంటే అతనికే అప్పగించాలి. ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి లేకపోతే చట్టబద్ధమైన వారసులుంటే వారికే ఆ భూములను అప్పగించాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోను అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు వీలు కల్పించరాదు. అలా చేస్తే చట్టం స్ఫూర్తికి తూట్లు పొడవడమే. ఈ చట్టం ప్రకారం భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన వ్యవసాయ భూమిని ఎట్టిపరిస్థితుల్లోను మరొకరికి హక్కు కల్పించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ చట్ట సవరణ చేస్తే ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ చట్టంలో సవరణ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

Sakshi | Updated: January 07, 2016 07:55 (IST)
బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌!వీడియోకి క్లిక్ చేయండి
► బలవంతపు వసూళ్లకు వీల్లేదు..
► ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరు రూ.10 చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. అలా ఎలా బలవంతపు వసూళ్లకు పాల్పడతారంటూ ప్రశ్నించింది. బలవంతపు వసూళ్లకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. రూ.10 ఇవ్వాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపింది.


ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ గుంటూరు ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ‘నా రాజధాని-నా అమరావతి-నా ఇటుక’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి తలా రూ.10 వసూలు చేసి ఆ మొత్తాలు ఈ నెల 10వ తేదీలోపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన ఎస్.కె.బషీర్ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు.

పిటిషన్‌ను కొద్దిసేపు క్షుణ్ణంగా చదివిన న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గురించి పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది మూలా విజయభాస్కర్‌ను వివరణ కోరారు. విద్యార్థులు రూ.10 ఇవ్వాలని ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. దీంతో విజయభాస్కర్ బిత్తరపోయారు. ఏం చెప్పాలో అర్థం కానట్టుగా కొద్దిసేపు పిటిషన్ బండిల్‌లో ఏవో కాగితాలు చూస్తూ ఉండిపోయారు. తర్వాత తేరుకుని రూ.10 విరాళం బలవంతం కాదని, స్వచ్ఛందమేనని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన సమాధానంతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే వాటిని తీసుకుంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని, ఉత్తర్వులు జారీ చేసి మరీ బలవంతంగా విరాళాలు స్వీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు.

లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్!

లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్!

Sakshi | Updated: January 07, 2016 08:08 (IST)
లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్!
హైదరాబాద్: :
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నారా లోకేష్, కేటీ రామారావు (కేటీఆర్) మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు కుమారుడు, మంత్రి కేటీఆర్ రాజకీయంగా దూసుకుపోతున్నారనీ... ఆయనతో పోల్చితే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాగా వెనకబడిపోయారన్న అంశం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కుమారుడే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేటీఆర్‌కు వచ్చినంత ప్రచారం తనకు ఎందుకు దక్కడం లేదని లోకేష్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో కేటీఆర్ కన్నా ఏపీలో తానే ఎక్కువ అధికారాలు చెలాయిస్తున్నప్పటికీ తనకు అంతగా ప్రాధాన్యం లభించకపోవడంపై లోకేష్ తెగ మథనపడిపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

గత సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని భావించిన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ కొద్ది నెలల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నారు. టీడీపీ అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లకు దగ్గర పడుతుండగా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవహారాల్లోనూ తన నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. పార్టీ నేతలనే కాకుండా మంత్రులను సైతం తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ప్రభుత్వపరమైన అనేక నిర్ణయాల్లో లోకేష్ ప్రమేయం లేకుండా జరగదన్న ప్రచారం కూడా ఉంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం లోకేష్ సలహాలు సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటారన్న విషయాన్ని ఉన్నతాధికారులు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతుంటారు.

అయితే ఇంత చేస్తున్నప్పటికీ తనకు తగిన ఫాలోయర్స్ లేకపోవడమేంటన్న ప్రశ్నకు సమాధానం దొరక్క లోకేష్ సన్నిహితుల మధ్య చర్చ మొదలైంది. లోకేష్‌ను రాజకీయాల్లో ఒక నాయకుడిగా చిత్రీకరించడానికి ఏం చేయాలన్న తర్జనభర్జన మొదలైంది.  తెలంగాణలో కేటీఆర్‌కు వస్తున్న స్థాయిలో ప్రచారం తనకు రాకపోవడమేంటి.. ఎందుకు ఇలా జరుగుతోంది... అనే అంశాలపై ఇటీవలి కాలంలో లోకేష్ తన సన్నిహితులతో సమాలోచనలు జరిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొంతకాలంగా చురుకైన పాత్ర పోషించడం, దానిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంపై ఆయన ఆరా తీశారు. కేటీఆర్ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించడం, ఐటీ దిగ్గజాల సమావేశంలో మాట్లాడటం వంటి అనేక వేదికల్లో పాల్గొంటున్న వివరాలను లోకేష్ పరిశీలించారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ పాల్గొంటున్న సభలకు కూడా మీడియాలో విశేష కవరేజీ వస్తున్న విషయాన్ని ఆయన సన్నిహితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత కేటీఆర్ రాజకీయంగా దూసుకుపోతుంటే... తాను బాగా వెనుకబడి పోతుండటంపై తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఏదోరకంగా మనం కూడా దూసుకుపోవాలని, అందుకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని వారిని కోరారు. ఇకనుంచి మీడియాలో విస్తృతంగా కనిపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. మీడియా ప్రచారం వచ్చే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కేటీఆర్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రచారం జరిగితే మనకు జాతీయ స్థాయిలో మీడియాలో ప్రచారం వచ్చేలా ప్లాన్లు తయారు చేయాలని చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. జాతీయ స్థాయిలో ప్రచారం  చేసుకోవడంపై లోకేష్ ఇటీవలే ఢిల్లీలో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తప్పించిన ఒక అధికారిని ఢిల్లీ కేంద్రంగా జాతీయ మీడియా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు పర్యవేక్షించాలని కోరినట్టు తెలిసింది. భారీ మొత్తాల్లో వెచ్చిస్తూ అప్పుడప్పుడు సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నారా వారి అబ్బాయి టీడీపీలో చరిష్మా ఉన్న నాయకుడిగా, చంద్రబాబు రాజకీయ వారసుడిగా ఎదుగుతాడన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Tuesday, 5 January 2016

గన్నవరానికి చంద్ర గ్రహణం!

గన్నవరానికి చంద్ర గ్రహణం!

Sakshi | Updated: January 05, 2016 00:28 (IST)
విజయవాడ:  గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం పన్నినట్లు సమాచారం. దశల వారీగా  భూమిని  కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏలూరు కాల్వను జాతీయ రహదారి ఎడమవైపునకు మళ్లించడం, ఎయిర్‌పోర్టు కుడివైపున మరో రన్‌వే నిర్మించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ భావిస్తోంది. ఏలూరు కాలువ మళ్లించాక, కార్గో సర్వీసులు నడిపేందుకు ప్రస్తుతం ఉన్న రన్‌వేకు కుడివైపున రెండో రన్‌వే నిర్మించనున్నారు. రెండు రన్‌వేల మధ్య కనీసం 1700 మీటర్ల దూరం ఉండాలి. అంటే ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఉన్న రన్‌వేకు సుమారు 1.75 కి.మి. అంటే 25 మీటర్లకు  తక్కువగా సుమారు  రెండు కిలోమీటర్ల మేర కార్గో విమానాలు దిగేందుకు రెండో రన్‌వే నిర్మించాల్సి ఉంది. రెండో రన్‌వే దగ్గర్లో కార్గో పాయింట్‌ను ఎయిర్‌పోర్టు, రోడ్డు, రైల్ రవాణా, మచిలీపట్నం, పోర్టుకు అనుసంధానంగా నిర్మించనున్నారు. ఇందుకు మరో మూడు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్నారు.

ఖాళీకానున్న గ్రామాలు
ఎయిర్‌పోర్టుకు కుడి వైపున ఉన్న అజ్జంపూడి, బుద్ధవరం, బూతిమిల్లిపాడు,  వెన్నూతల గ్రామాల్లో ఇళ్లు, భూమలు గల్లంతవుతాయి. రెండో రన్ వేకు దాదాపు రెండు వేల ఎకరాలు, టాక్సీవే, సెక్యూరిటీ జోన్, కార్గోపాయింట్ గోడౌన్ల నిర్మాణాలకు మరో వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏలూరు కాల్వ మళ్లించాక మూడో దశలో రెండో రన్‌వే భూమిపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. బందర్ పోర్టు వద్ద టౌన్‌షిప్ మాదిరిగా, ఎయిర్ పోర్టుతో గ్రామాల్లో ఇళ్లు కోల్పోయే వారికి టౌన్‌షిప్ అబివృద్ధి చేసి ఇచ్చేలా ప్రభుత్వం కొత్త ప్లాన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

రెండో రన్‌వే కోసమే ఏలూరు  కాల్వ మళ్లింపు
మొదట ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన రాలేదు. ముందుగా బుద్ధవరం నుంచి ఆత్కూరు వరకు కాల్వను మార్చటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. పడవలు నడవడానికి వీలుగా ఏలూరు కాల్వ వెడల్పు పెంచుతున్నామని, అందుకే కాల్వను పక్కకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  రెండో రన్‌వే ఏర్పాటు, కార్గో పాయింట్ కోసమే కాల్వను ఎడమవైపునకు మళ్లిస్తున్నారు. కాల్వ మళ్లింపు వల్ల గన్నవరం స్వరూపమే మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విడిపోనున్న పలు గ్రామాలు
అధికారులు సర్వే చేసిన ప్రకారం ఏలూరు కాల్వ మళ్లిస్తే గన్నవరం నుంచి వెంకటనరసింహాపురం, మర్లపాలెం విడిపోతాయి. పెదఅవుటపల్లి రెండు ముక్కలవుతుంది. ప్రత్యామ్నాయంగా జక్కులనెక్కలం నుంచి సావరగూడెం వెనుక వైపు నుంచి ముస్తాబాద రైల్వే ట్రాక్ పక్కనుంచి చినఅవుటపల్లి, పెదఅవుటపల్లి మీదుగా ఏలూరు కాల్వను కలపాలని మరో డిజైన్‌ను సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కనే విలువ లేని భూములు పోతాయని, ఇళ్ల తొలగింపు అవసరం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చామని, మళ్లీ కాల్వ మళ్లించి రెండోసారి తమ భూములు లాక్కోవడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని కేసరపల్లి గ్రామస్తులు అంటున్నారు.

ఏలూరు కాల్వ వస్తే బతుకులు తల్లకిందులు
పొలం అమ్ముకుని రూ. 70లక్షలతో మంచి భవ నం కట్టుకుని, ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఏలూరు కాల్వ మళ్లిస్తే మా ఇల్లు కోల్పోతాం.  ఇళ్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం చూపకుంటే ప్రజల బతుకులు తల్లకిందులవుతాయి.                              - కంభంపాటి శేషగిరిరావు, మర్లపాలెం

 కాల్వ మళ్లింపుపై పునరాలోచన చేయండి
 కాల్వ మళ్లింపుతో రూ. 80లక్షల విలువ చేసే ఇల్లు ధ్వంసమవుతుంది.  మాఇల్లూ వాకిలీ ఏమైపోతాయోనని ఆందోళనగా ఉంది.  కోట్ల విలువైన భూములు పోతాయని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.                         - కొల్లి సుభాషిణి, మర్లపాలెం.
 

మేం తిరగబడితే మీకు పుట్టగతులండవు బాబూ..

న్యూస్ ఫ్లాష్1000 పరుగులు చేసిన ప్రణవ్ ధనవాడేకు సచిన్ టెండూల్కర్ అభినందనలుShare on:
  
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకథ

మేం తిరగబడితే మీకు పుట్టగతులండవు బాబూ..

Sakshi | Updated: January 05, 2016 15:55 (IST)
మేం తిరగబడితే మీకు పుట్టగతులండవు బాబూ..
కిర్లంపూడి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటుగా లేఖాస్త్రం సంధించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు బహిరంగ సభ నిర్వహిస్తామని, తాము తిరగబడితే మీకు పుట్టగతులుండవని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ దినపత్రికలో తనపై వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని,  చంద్రబాబుకు దమ్ముంటే తన పేరుతోనే వార్తలు రాయించవచ్చని ముద్రగడ సవాల్ విసిరారు.
ముద్రగడ తన లేఖలో ఏమన్నారంటే... తమరి పరిపాలనలో కుల సమావేశం మాజాతి తప్ప ఎవరైనా పెట్టుకోవచ్చా? మీ సొంత సామాజిక వర్గం తరచూ పెట్టుకున్నా అభ్యంతరంలేదా? మా జాతి తాలిబన్ టెర్రరిస్టుల్లాంటి వారా? లేక ఏ దేశం నుంచైనా తన్ని తరిమేస్తే ఈ దేశానికి వచ్చినవారమా? ఈ కరివేపాకు జాతి అంతరించి పోవాలని మీజాతిలో కొందరి పెద్దల ఆరాటమా? భారత రాజ్యాంగంలో ఈ జాతి వారు సభలు పెట్టుకోకూడదని ఆంక్షలేమైనా ఉన్నాయా? మీ జాతి వారు మీ సహకారంతో విదేశాలలో కులసభలు పెట్టుకోవడం లేదా?.

 ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లు, ఏటా రూ.1000 కోట్లు ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇవ్వడం వల్లే మీరు గద్దెనెక్కారు. కోరిక తీరిన తర్వాత వామనమూర్తి బలిచక్రవర్తిని అభినందిస్తూ పాతాళానికి తొక్కినట్లుగా కాపు జాతి ఓట్లతో నెగ్గి, వారిని మీ పాదాలతోనే అధ:పాతానికి తొక్కివేయాలనే ఆలోచన మహాపాపం. వంగవీటి రంగాని చంపినప్పుడు ఈ జాతిపై తడా చట్టం ప్రయోగించినప్పుడు కూడా కాకినాడలో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నామే, ఎన్నో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో సభలు జరుపుకున్న సందర్భాలలో లేని ఆంక్షలు 2016 జనవరి ఆఖరి వరకు పెట్టడంలో గల ఆంతర్యం ఈ కాపు జాతిని యుద్ధానికి ముందే ఆహ్వానించడమా? కయ్యానికి కాలు దువ్వడమా?

రాజ్యాంగం, చట్టాలు మీ కులం లేక మీ కుటుంబం కోసం తయారు చేసినవు కావు. ప్రజల కోసం ఎప్పటికప్పుడు చట్టాలు మార్పు చేసుకోవచ్చు. అలాంటిది మాకులం సమస్య వచ్చినప్పుడు వంకరగా మాట్లాడటం ఆపండి. ఈ ఉద్యమంలో మా సోదర సోదరీమణులపై లాఠీలు ఎత్తితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. 1910 నుంచి 1956 వరకు, 1961 నుంచి 1966 వరకు మా కాపు జాతి అనుభవించిన బీసీ రిజర్వేషన్లు వెంటనే పునరుద్ధరించాలి. రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన జీఓ నెం.30/94 అమలు చేయాలి. లేదా కాపు జాతిని బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించమని మరో కొత్త జీఓ అయినా ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపండి తప్ప కమిషన్లు వేసి ఈ జాతిని మోసం చేయకండి' అని లేఖలో పేర్కొన్నారు.

Saturday, 2 January 2016

మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు

మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు

Others | Updated: January 01, 2016 15:59 (IST)
మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో హామీలతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ 2014, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2015లోనన్నా తమ బతుకులకు కొత్త మెరుగులు దిద్దుతుందని ఆశించిన ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీకి పట్టంగట్టారు. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ నెరవేర్చలేక పోయింది.

గడిచిందీ ఏడాదిన్నరేగదా! ఇంకా మూడున్నర ఏళ్ల గడువుందంటూ గొంతు విప్పేవాళ్లు, వాదించే వాళ్లు ఉండొచ్చు. కానీ హామీలను అమలుచేసే దిశగా చిత్తశుద్ధితో చర్యలైతే మొదలు పెట్టాలిగా. మరది కనిపించదేం. ముఖ్యంగా 12 రంగాల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం నెలకో అంశం మీద దృష్టి పెట్టినా ఈ రంగాల్లో విజయం సాధించి ఉండేది.

1.ధరల పెరుగుదల: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకుల ధరలను అరికట్టడంలో, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో  గత యూపీఏ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఎండగట్టింది. ఆహార ద్రవ్యోల్బణంపై నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ 2011లో సమర్పించిన సిఫార్సులను అమలు చేసినట్లయితే ఈ పరిస్థితి దాపురించేది కాదని కూడా కూతలేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ రంగంలో పరిస్థితి ఏమైనా మారిందా? సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఉల్లి, పప్పు దినుసుల ధరలు నేడెక్కడున్నాయో అందరికి తెల్సిన విషయమే. తాము అధికారంలోకి వస్తే సరకు అక్రమ నిల్వదారుల భరతం పడతామని, వారిని సత్వరం విచారించి శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

 2. చమురు ధరలు: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 75 రూపాయలు ఉండింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ ధర 100 డాలర్లకు పైనే. చమురు ధరలు చంపేస్తున్నాయని, వీటిని ఎందుకు అరికట్టడం లేదంటూ అప్పుడు ప్రతిపక్షంలోవున్న బీజేపీ మంట పుట్టించింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ ధర 50 డాలర్లుకు దిగువకు పడిపోయినా దేశంలో లీటరు పెట్రోలు ధర 61 రూపాయలకు పైనే ఎందుకున్నది. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోలు ధర లీటరు 38 రూపాయలకు దాటకూడదు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించేందుకు చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని గొప్పగా చెబుతూ వస్తోన్న మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా పడిపోతున్న ధరలకు అనుగుణంగా చేకూరే లబ్ధిని ఎందుకు వినియోగదారులకు బట్వాడా చేయడం లేదు?

 3. ఉద్యోగావకాలు: దేశంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చడంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ నాలుకకు తడారిపోయేలాగా ప్రతిచోట విమర్శిస్తూ వచ్చారు. ఆయన్నే స్వయంగా ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వరంగంలో ఉద్యోగావకాశాలపరంగా ఆయన తీసుకున్న చర్యలేమిటీ? ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను దండిగా కల్పిస్తామంటూ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే నినాదాన్ని పట్టుకొని దేశ దేశాలు తిరుగుతున్నారే తప్పా తెచ్చిందేమీ లేదు.

4. నల్లడబ్బు సంగతేమిటీ?: విదేశాల్లో మూల్గుతున్న 70లక్షల కోట్ల రూపాయల డబ్బును వంద రోజుల్లోగా దీశంలోకి తీసుకొస్తామని శపథం చేసిన ప్రభుత్వం 19 నెలలవుతున్నా నెరవేర్చలేదు. ఇప్పుడిది మాట్లాడడం కూడా పెద్ద జోక్‌గా మారింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పదే పదే ప్రస్తావించి మోదీ ప్రభుత్వం పరవుతీశారు.

5. ప్రభుత్వ సేవల్లో వైఫల్యం: ప్రభుత్వ సేవల రంగంలో కూడా అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పు రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావాలంటే చెప్పులరిగేలా తిరగాల్సిందే. అంత ఓపిక లేనివారు చేతులు తడిపి పనులు చేయించుకుంటున్నారు. రెడ్ టేపిజానికి బూజులు దులుపుతున్న దాఖలాలు లేవు. వివిధ విభాగాలను సమన్వయం చేసి సామాన్యులకు సైతం సులభంగా పనులయ్యేలా చేస్తామన్న ప్రభుత్వం అసలు ఆ దిశగానే ఆలోచించడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది.

6. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: ఈ అంశంలోనూ పురోగతి పెద్దగా ఏమీ కనిపించడం లేదు. టీమ్ ఇండియా స్ఫూర్తి గురించి ఇప్పటికీ చెప్పే మోదీ మరి ఎందుకు ఇందులో విఫలమవుతున్నారు. తమ పాలిత రాష్ట్రాల పట్ల మోదీ శీతకన్నేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, తమ ప్రభుత్వం పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎందుకు గోల చేస్తున్నారు? ఇక ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వంతోని నిత్త తగువేనాయే!

7. మహిళల కోసం ఏం చేశారు?: మహిళల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీజేపీ ప్రకటించింది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించింది. ఇది ఈజీగా ఇట్టే అమలు చేయవచ్చు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించన బిల్లును యూపీఏ హ యాంలోనే రాజ్యసభ ఆమోదించింది. ఇప్పుడు లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. తల్చుకోవడమే తరువాయి.

 8. జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ పండిట్లకు గౌరవప్రదంగా పునరావాసం కల్పిస్తామని, వారి పూర్వికుల ఆస్తులను వారికి అప్పగిస్తామని, ఉపాధి కూడా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. ఇది పార్టీ ఎజెండాలోని ప్రధాన అంశం అయినప్పటికీ ఇప్పటికీ దీన్ని నెరవేర్చలేదు. పండిట్టు స్వదేశంలో పరాయి బతుకు బతుకుతున్నారు.

 9. జుడిషియల్, పోలీసు, ఎన్నికల సంస్కరణలు: న్యాయం జరగడంలో ఆలస్యమైతే అసలు న్యాయం జరగని కిందకే లెక్కన్న మాట ఇప్పటికీ అక్షరాల నిజమే. ఇందులో గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఇప్పటికీ లక్షల కేసులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. సత్వర విచారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడంగానీ, అధికారాలు పెంచడంగానీ చేయలేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఆ మాట దేవుడెరుగు, వారి ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు కూడా నిధులివ్వడం లేదు. ఎన్నికల బరిలోకి నేరస్థులను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అదీ అతీగతీ లేదు.

 10. మైనారిటీలకు చేసిందేమీ లేదు?: వారిని మరింత దూరం చేసుకోవడం తప్పా మైనారిటీల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కనీసం ప్రభుత్వం పదవుల్లో కూడా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించలేక పోయింది.

 11. ఉమ్మడి పౌరస్మృతి: బీజేపీ ప్రధాన ఎజెండాలో ఇదో అంశం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్లు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకరాకపోతే ప్రజల మధ్య సమానత్వం సాధించడం అసాధ్యమని చెప్పే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కనీసం బిల్లును కూడా రూపొందించలేదు.

12. జీఎస్‌టీ బిల్లు: ఇది ఎందో కీలకమైన బిల్లుగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ప్రతిఘటనా వైఖరితో బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కలసిరాకపోవడం వల్లనే సాధ్యంకాక పోవచ్చు. ప్రతిపక్షాల వైఖరి అలాగే ఉంటుంది. సర్దుబాటు ధోరణితో వ్యవహారాన్ని చక్చబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Friday, 1 January 2016

ఒక భూమికి ఒకే పత్రం

ఒక భూమికి ఒకే పత్రం 
02-01-2016 03:18:11

  • పాస్‌బుక్‌, టైటిల్‌ డీడ్‌ వేర్వేరు కాదిక!
  • రెండూ కలిపి సింగిల్‌ డాక్యుమెంట్‌
  • తహసీల్దారుకే జారీ అధికారం
  • ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
  • వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా రుణాలు
  • ఒకే సర్వే నంబర్‌పై
  • వేర్వేరు బ్యాంకుల్లో లోన్లు కుదరవు

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇక ఒక భూమికి... ఒకటే రికార్డు! పాస్‌ బుక్‌ అని, టైటిల్‌ డీడ్‌ అని, మరొకటని, ఇంకొకటని రకరకాల గందరగోళాలు ఉండవు! భూమి హక్కు రికార్డుల విషయంలో ఇలా కీలక సంస్కరణలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. భూమి హక్కులను తెలియజేసేందుకు ఒకటికి మించి ఎక్కువ రికార్డులు ఉండటం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంటోందని, అవినీతికి ఆస్కారం కల్పిస్తోందని భావిస్తోన్న సర్కారు సింగిల్‌ డాక్యుమెంట్‌ విధానం తీసుకురావాలనుకుంటోంది. దీంతోపాటు బ్యాంకు రుణాలు పొందడం, రిజిసే్ట్రషన్‌లు, మ్యుటేషన్‌లకు కూడా ఇది వర్తించేలా భూమి హక్కుల చట్టం (ఆర్వోఆర్‌)లో సవరణలు తీసుకురావాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే, ఈ ప్రతిపాదనల్లో ప్రజలకు మేలు చేసేవి కొన్ని ఉంటే..... ప్రజలతోపాటు ప్రభుత్వానికీ తలనొప్పులు తెచ్చిపెట్టేవి కొన్ని ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆమోదంలో ముఖ్యమంత్రిదే అంతిమ నిర్ణయమని రెవెన్యూశాఖ చెబుతోంది.
ఇదీ అసలుకథ.... 
భూమి హక్కులపై ప్రస్తుతం రెండు రకాల రికార్డులున్నాయి. ఒకటి పట్టాదారు పాస్‌ పుస్తకం. రెండోది టైటిల్‌డీడ్‌. పాస్‌బుక్‌ను తహసిల్దార్‌ ఇస్తారు. టైటిల్‌ డీడ్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్డీవో) సంతకంతో ఇస్తారు. భూమి హక్కుల పత్రం (ఆర్వోఆర్‌) చట్టంలోని పలు నిబంధనల మేరకు... ఈ రెండు సమర్పించిన తర్వాతే బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఈ రెండు డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ జరుతాయి. అయితే... పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌ జారీలో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటోందనే విమర్శలున్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా రెవెన్యూ రికార్డులను ప్రజల వద్ద ఉన్న రికార్డులతో సరిపోల్చి, వాటిని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ‘మీ భూమి’ అనే వెబ్‌సైట్‌ (వెబ్‌ల్యాండ్‌)ను ఏర్పాటు చేసి అందులో పొందుపరిచారు. 1బీ రిజిస్టర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘మీ ఇంటికి - మీ భూమి’ కార్యక్రమం కింద గ్రామసభలు నిర్వహించి వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రికార్డులను సరిపోల్చారు. గ్రామాల వారీగా 1బీ రిజిస్టర్‌లను ప్రజలకు అందించారు. ఇక వెబ్‌ల్యాండ్‌లో రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉన్నందున... బ్యాంకులు, రిజిస్ట్రేషన్‌ సిబ్బంది రైతులను పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్‌లు కోరవద్దని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ... బ్యాంకులు ఇందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని సవరించకుండా, కేవలం సర్క్యులర్‌ ద్వారా ఆదేశాలను మారిస్తే అమలు చేయలేమని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్వోఆర్‌ చట్టంలోనే సవరణలు తీసుకురావాలని తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు చేసిన ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి ఇవి...
తహసిల్దార్‌కే అధికారం 
పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్స్‌ స్థానంలో సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) సింగిల్‌ డాక్యుమెంట్‌ ఇవ్వాలి. అంటే... పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్స్‌ ఒకే డాక్యుమెంట్‌లో కలిసి ఉంటాయి. సమీకృత డాక్యుమెంట్‌ను పూర్తిగా తహసిల్దార్‌ స్థాయిలోనే జారీ చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే టైటిల్‌ డీడ్స్‌ ఇచ్చే అధికారాన్ని ఆర్‌డీవో నుంచి తప్పించి తహసిల్దార్‌కే అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కాబట్టి, భూమి హక్కులకు సంబంధించిన సింగిల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చే అధికారాన్ని కూడా పూర్తిగా తహసిల్దార్‌కే అప్పగించేలా కొన్ని సవరణలు తీసుకొస్తారు. ఈ సింగిల్‌ డాక్యుమెంట్‌నే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వెబ్‌ల్యాండ్‌లోనూ పొందుపరిచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు తమ డాక్యుమెంట్‌ను పట్టుకెళ్లకుండానే ఇటు బ్యాంకులు, అటు రిజిసే్ట్రషన్‌ శాఖ పనులు పూర్తిచేయించే ఆలోచనలు ఉన్నాయి. అయితే, ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నవాదనలున్నాయి. బ్యాంకులు ఇందుకు సమ్మతం తెలిపినట్లు తెలిసింది.
లోనుకూ లంకె 
బ్యాంకులు వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల వివరాలను ప్రాతిపదికగా తీసుకొని రుణాలు ఇచ్చేలా ఆర్వోఆర్‌ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. ఈ మేరకు రెండుచోట్ల క్లాజులను మార్చనున్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకర్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా అనుసంధానం చేశారు. లోన్‌చార్జ్‌ క్రియేషన్‌ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాంకు, ప్రతీ బ్రాంచ్‌ పరిధిలో వెబ్‌ల్యాండ్‌లోకి వెళ్లి వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఖాతాలను కూడా సృష్టించారు. ఉదాహరణకు... ఒక బ్యాంకు వద్దకు రైతు రుణం కోసం వెళ్తే, ఆయనిచ్చిన వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తారు. సర్వే నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌, భూముల 1బీ రిజిస్టర్‌ను పరిశీలించి అన్నీ పక్కాగా ఉన్నాయనుకుంటే రుణం మంజూరు చేస్తారు. వెబ్‌ల్యాండ్‌లోనే రైతు భూముల వివరాల వద్దే బ్యాంకునుంచి తీసుకున్న రుణం వివరాలను కూడా నమోదు చేస్తారు. ఈ సమాచారం ఇతర బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. అంటే, ఒకే సర్వేనెంబర్‌పై వేర్వేరు బ్యాంకుల నుంచి రుణం పొందడం కుదరదు. రైతు తన రుణాన్ని పూర్తిగా చెల్లిస్తే ఆ వివరాలను కూడా వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తారు.

తహసిల్దార్ల ‘సెల్ఫ్‌’ మ్యుటేషన్‌ 
తహసిల్దార్‌లే ఆటోమ్యుటేషన్‌ చేసేలా ఒక ప్రతిపాదన రూపొందించారు. రిజిస్ట్రేషన్‌లు ముగిసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ తహసిల్దార్‌కు ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే తహసిల్దార్‌ సుమోటోగా మ్యుటేషన్‌ చేయాలి. అంటే, దాన్ని ఆర్డీవోకు పంపించకుండానే తన స్థాయిలో ఫైలు వచ్చిన వెంటనే పరిష్కరించాలన్న మాట. ఈ ప్రతిపాదనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చే ఫైలుపై తహసిల్దార్‌ సుమోటోగా స్పందించడం వరకు బాగానే ఉందని, ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండానే మ్యుటేషన్‌ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక... దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ ఓకే చేసి మ్యుటేషన్‌కోసం తహసిల్దార్‌కు పంపిస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం... తహసిల్దార్‌ ఎలాంటి విచారణ చేపట్టకుండానే సుమోటో మ్యుటేషన్‌ చేసి ఫైలును వెనక్కు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములపై కూడా అంటే ఎంచక్కా హక్కులు పొందవచ్చన్నమాట. దీని వల్ల మొదట నష్టపోయేది ప్రభుత్వమేనని, ఇక ప్రజల భూములకూ గ్యారంటీ ఉండదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.