Showing posts with label Barak Obama. Show all posts
Showing posts with label Barak Obama. Show all posts

Saturday, 20 July 2013

నల్లవారికి నరకమే!

నల్లవారికి నరకమే!

July 21, 2013
Andhrajyothy Telugu Daily 
వాషింగ్టన్, జూలై 20: సుదీర్ఘ కాలంగా జాతివివక్షను ఎదుర్కొంటున్న నల్లజాతివారి దృష్టికోణాన్ని అమెరికన్లు అర్థం చేసుకోవాలని అగ్రరాజ్యాధిపతి బారాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. కిందటి సంవత్సరం అమెరికాలో హత్యకు గురైన 17 ఏళ్ల నల్లజాతి యువకుడు ట్రేవాన్ మార్టిన్ కేసులో నిందితుడు జార్జ్ జిమ్మర్‌మ్యాన్‌ను కోర్టు ఇటీవలే నిర్దోషిగా విడుదల చేయడంపై ఆయన స్పందించారు. అయితే, కోర్టు నిర్ణయాన్ని ఒబామా తప్పు పట్టలేదు. కాకపోతే.. నల్లజాతివారు అడుగడుగునా ఎదుర్కొన్న/ఎదుర్కొంటున్న అవమానాలను ఆయన మననం చేసుకున్నారు. ట్రేవాన్ మార్టిన్ కేసు విషయంలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎందుకు అంతగా బాధపడిందీ ఆయన వివరించారు. "చనిపోయిన ట్రేవాన్ మార్టిన్ 35 ఏళ్ల క్రితం నేనైనా అయ్యుండొచ్చు'' అంటూ నల్లజాతివారు ఎంత అభద్రతా భావంతో జీవితం గడుపుతున్నదీ ఒక్కమాటలో తెలిపారు.

"ఏదైనా డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో.. తమను వెనకాలే ఉండి గమనించేవారు లేకుండా షాపింగ్ చేసే ఆఫ్రికన్ అమెరికన్లు చాలా తక్కువ మంది.. నాతో సహా'' అంటూ నల్లవారిపై తెల్లవారి అనుమాన దృష్టిని ఎత్తి చూపారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే.. ఆ దారిలో ఉన్న కారు డోర్లు లాక్ చేస్తున్నట్టుగా 'క్లిక్'మనే శబ్దాలు విన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "ఎలివేటర్‌లో నల్లవారు ఎక్కగానే.. లోపల ఉన్న తెల్లజాతి మహిళలు తమ పర్సుల్ని గట్టిగా బిగించిపట్టుకోవడం, లిఫ్టు ఆగి తాము బయటికి వెళ్లేదాకా వారు తమ ఊపిరి బిగబట్టి నిలబడటం అనుభవంలో లేని ఆఫ్రికన్ అమెరికన్లు కొద్దిమందే'' అంటూ నల్లవారి హృదయాల్లోని బాధను ఆవిష్కరించారు. జిమ్మర్ మ్యాన్ స్థానంలో ట్రేవాన్ గనక ఉంటే శిక్ష నుంచి అంత తేలిగ్గా తప్పించుకునేవాడా ఆలోచించాలన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సందేహించాల్సిన పరిస్థితి వస్తే.. అలాంటి చట్టాలను మనం మరోసారి సమీక్షించుకోవాలని తనకు అనిపిస్తోందన్నారు. కాగా.. అధ్యక్షుడి స్థానంలో ఉండి, తమ కుమారుడిలో తనను తాను చూసుకున్న ఒబామా ఔదార్యం కదిలించిందని ట్రేవాన్ తల్లిదండ్రులు సైబ్రియా ఫుల్టన్, ట్రేసీ మార్టిన్‌లు భావోద్వేగంతో అన్నారు. తమ కుమారుడి హత్య కేసుకు సంబంధించి ఒబామా స్పందన తమకు గొప్ప శాంతిని కల్గించిందని వారు పేర్కొన్నారు.

ఇదీ కేసు..
2012, ఫిబ్రవరి 26న సాయంత్రం ఏడు గంటల సమయంలో.. ఒక గేటెడ్ కమ్యూనిటీలోని కిరాణా దుకాణంలో సరుకులు కొనుక్కొని వెళ్తున్న ట్రేవాన్ మార్టిన్ (17) అనే యువకుణ్ని అక్కడి భద్రతా వ్యవహారాలు చూస్తున్న జార్జ్ జిమ్మర్ మ్యాన్ కాల్చి చంపేశాడు. ట్రేవాన్ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని, అతడి నుంచి ఆత్మరక్షణ కోసమే అతణ్ని కాల్చిచంపానని జిమ్మర్ మ్యాన్ తన వాదన వినిపించాడు. అయితే, ట్రేవాన్ నల్లజాతి వ్యక్తి కావడం వల్లనే జిమ్మర్‌మ్యాన్ అతణ్ని అనుమానంతో కాల్చిచంపాడని అమెరికావ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నల్లజాతివారు హత్యకు గురైన ట్రేవాన్‌ను తమకు ప్రతిరూపంగా భావించారు. అధ్యక్షుడి స్థాయిలో ఉన్న ఒబామా సైతం తన ఆందోళనను ఇలా బహిరంగంగా వ్యక్తపరచడం వారి ఆవేదనకు అద్దం పడుతోంది