Thursday, 16 February 2017

పెత్తనం పురుషులదే!

పెత్తనం పురుషులదే!
16-02-2017 00:18:00
మహిళలకు క్రమంగా తగ్గుతున్న స్వేచ్ఛ
ఇంట్లో ఏది వండాలో నిర్ణయించేదీ ఆయనే
బయటికెళ్లాలంటే శ్రీవారికి చెప్పక తప్పదు
భర్తను ఎంచుకునే స్వేచ్ఛ 5 శాతం మందికే
అక్షరాస్యత పెరిగినా అభివృద్ధి అంతంతే!
తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి మరీ ఘోరం చదువుంది.. డబ్బులున్నాయి.. కానీ స్వేచ్ఛ లేదు. ఇదీ నేటి తరం మహిళల భావన. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా భర్తో.. అత్తమామలకు చెప్పివెళ్లాల్సిందేనని వీరు పేర్కొంటున్నారు. పోనీ నచ్చింది వండుకుని తిందామన్నా.. దానికీ ‘ఆయన’ ఒకే చెప్పాల్సిందేనని అంటున్నారు. పైగా పదేళ్ల కిందటితో పోల్చితే ఇప్పుడు ఎక్కువ శాతం మంది మహిళలు తమకు స్వేచ్ఛ తగ్గిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణల్లో అయితే ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇంట్లో పెద్దలకు చెప్పి వెళ్లాల్సిందేనని 88 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. చివరకు ఏది వండాలో కూడా పురుషులే నిర్ణయిస్తున్నారని 62 శాతం మంది తెలుగు మహిళలు అభిప్రాయపడుతున్నారు. కాగా బాలికల లింగ నిష్పత్తి, అక్షరాస్యత పెరిగినా మహిళా స్వేచ్ఛ విషయంలో ఆశించినంత మార్పు లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికీ చాలా విషయాల్లో మహిళలకు స్వేచ్ఛ అంతంత మాత్రంగానే ఉంటోందని వివరిస్తున్నారు. మొత్తానికి దేశంలో 65 శాతం మంది మహిళలు చదువుకోగా.. భర్తను ఎంపిక చేసుకోగలిగేంత స్వేచ్ఛ కేవలం అయిదు శాతం మందికి మాత్రమే ఉంది. 2005, 2012లో మేరీలాండ్‌ యూనివర్శిటీ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌లు సంయుక్తంగా జరిపిన భారత మానవ అభివృద్ధి సర్వేలను పరిశీలిస్తే ఈ వివరాలు స్పష్టమయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, నగరాలు, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో 34 వేల మంది మహిళల వద్ద ఈ సర్వే నిర్వహించారు. 15 ఏళ్ల నుంచి 81 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 79.8 శాతం మంది మహిళలు పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇంట్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని వివరించారు. 2005లో ఈ శాతం 74.2గా ఉంది. అంటే.. ఇప్పుడు అదనంగా అయిదు శాతం మంది మహిళలు.. పెద్దలకు చెప్పకుండా ఆసుపత్రికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదని స్పష్టం చేశారు.

73 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఎంపిక చేస్తారని చెప్పారు. 5 శాతం మంది మాత్రం తామే ఎంచుకోగలమని వివరించారు. కాగా పురుషులకు సంబంధించి ఇలాంటి సర్వే నిర్వహించలేదు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈశాన్య రాష్ర్టాల మహిళలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛ ఎక్కువ. ఉత్తరాది మహిళలకు ఈ విషయంలో స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద దేశంలో 80 శాతం మంది స్ర్తీలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భర్త అనుమతి ఉండాల్సిందేనని భావిస్తున్నారు. వీరిలో 79.94 శాతం మంది అత్తల అనుమతి కూడా కావాలని చెబుతుండగా.. 79.89 శాతం మంది మావయ్య అనుమతీ ఉండాల్సిందేననీ భావిస్తున్నారు. అంటే మొత్తం మీద దాదాపు 80% మహిళలు బయటకు వెళ్లాలంటే ఇంట్లో భర్త, అత్తమామలకు చెప్పి వెళ్లాల్సిందే. ఇంటి పక్కన ఉండే కిరాణా దుకాణానికి వెళ్లాలన్నా.. పెద్దల అనుమతి ఉండాలని 58% చెప్పారు. 2005లో ఇలా అభిప్రాయపడిన వారు 44.8 శాతం మందే. కాగా.. ప్రస్తుతం మహిళలపై నేరాలు పెరుగుతుండటంతో వారిని బయటకు పంపాలంటే కాస్త ఆలోచించాల్సిందేనని ఇంట్లో పెద్దలు చెబుతున్నారు.

తొలి చూపు..!
65 శాతం మంది మహిళలు తమకు భర్త పెళ్లిలోనే మొదటిసారిగా పరిచయమవుతున్నట్లు తెలిపారు.
హార్లో అయితే 94%మహిళలు పెళ్లి రోజుకు ముందు తమ భర్త ఎలా ఉంటారో కూడా తెలియదని చెబుతున్నారు.
ఉమ్మడి ఏపీలో లింగ నిష్పత్తి 993గా ఉన్నా.. 88.7%మందికి ఆసుపత్రికి వెళ్లాలంటే ఇంట్లో అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది దేశ సగటు దాదాపు 80%కన్నా ఎక్కువే.
ఢిల్లీలో 86.21%మంది చదువుకున్న మహిళలున్నా.. భర్తను ఎంచుకోగలిగేంత స్వేచ్ఛ ఉన్న వారు 2.09%మందే. అక్షరాస్యత తక్కువగా ఉన్న మేఘాలయలో 76.9%భర్తలను సొంతంగా ఎంపిక చేసుకోగలమన్నారు.


వంట నిర్ణయమూ శ్రీవారిదే..!
సర్వేలో పాల్గొన్న వారిలో 92.89 శాతం మంది మహిళలు వంట వండుతున్నట్లు చెప్పారు. వీరిలో 50 శాతం మంది ఇంట్లో ఏమి వండాలో భర్తే నిర్ణయిస్తారని వివరించారు. గతంతో పోల్చితే ఈ పరిస్థితి రానురానూ తీసికట్టుగా తయారవుతోంది. 2005లో ఇంట్లో ఏమి వండాలో ఎక్కువగా మహిళలే నిర్ణయించేవారు. ఇప్పుడు ఈ విషయంలోనూ పురుషుల పాత్ర పెరుగుతోంది. ఏపీ తెలంగాణల్లో అయితే ఏమి వండాలన్నది నిర్ణయించే విషయంలో భర్తలు జోక్యం చేసుకుంటున్నట్లు 62%మహిళలు తెలిపారు.

No comments:

Post a Comment