Tuesday, 20 September 2016

డిజైన్లు బాగోలేవు

డిజైన్లు బాగోలేవు
20-09-2016 00:22:28

ప్రధాన కట్టడాల విషయంలో సీఎం అసంతృప్తి
అమరావతి డిజైన్ల కోసం మళ్లీ గ్లోబల్‌ బిడ్‌!
నేడు సీఆర్‌డీఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
సీఎంతో ఆర్కిటెక్ట్‌ సంస్థ హఫీజ్‌, నెదర్లాండ్‌ సంస్థలు భేటీ
హైదరాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో ప్రధాన కట్టడాల డిజైన్లపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. భారతీయ, రాషీ్ట్రయ సంప్రదాయాలతో, ప్రపంచ స్థాయిలో ఉండాలని ఆశించామని, కానీ ఇప్పటి వరకూ అలాంటి డిజైన్లు గుర్తించలేకపోయామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అంతర్జాతీయ టెండర్లలో ఇప్పటికే జపాన్‌కు చెందిన మాకీ సహా ఇతర సంస్థలు తమ డిజైన్లు సమర్పించినా... అవేవీ ఆకట్టుకునే విధంగా లేవని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. థర్మల్‌ విద్యుత చిమ్నీలను పోలి ఉన్న భవనాల డిజైన్లను మాకీ రూపొందించడం, ఇప్పటికే ఆ తరహా డిజైన్లు ఇతర రాష్ట్రాల్లో వినియోగించడం వల్ల కాపీ కొట్టామన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందని, ప్రత్యామ్నాయాలు చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు బృందం ఆస్థానాతో సహా సింగపూర్‌, మలేషియా, చైనా, జపాన్‌ నగరాలలో పర్యటించి అంతర్జాతీయ డిజైన్లను పరిశీలించింది. ఇటీవల సీఆర్‌డీఏ బృందం కూడా ఈ దేశాల్లో పర్యటించింది. కానీ, డిజైన్ల రూపకల్పన బాధ్యతలను ఎవరికి ఇవ్వాలన్న అంశంపై తుది నిర్ణయానికి రాలేదు. ఫలితంగా అమరావతి నగర ప్రధాన కట్టడాల డిజైన్ల ఎంపికలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. కట్టడాల నిర్మాణ పనులూ చేపట్టడానికి ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అర్కిటెక్ట్‌ సంస్థ హఫీజ్‌, నెదర్లాండ్‌ అర్కిటెక్ట్‌ సంస్థలు సోమవారం విజయవాడలో చంద్రబాబును కలిసి తమ ప్రతిపాదనలు అందించాయని సమాచారం. మంగళవారం సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో అమరావతి నగర ప్రధాన కట్టడాల డిజైన్ల కోసం మరో దఫా గ్లోబల్‌ టెండర్లను పిలవడంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

No comments:

Post a Comment