Friday, 31 October 2014

1984 అల్లర్లు భారత్‌పై మచ్చ - నరేంద్ర మోదీ

1984 అల్లర్లు భారత్‌పై మచ్చ

మొత్తం జాతిపై జరిగిన దాడి అది    ఇందిర వర్ధంతి రోజే నాటి అల్లర్లపై 
నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్య     దేశ ఐక్యత పటేల్‌ వల్లేనని ప్రశంస 
పటేల్‌ లేని మహాత్ముడు అసంపూర్ణమని విశ్లేషణ
శక్తిస్థల్‌లో నివాళులు అర్పించని ప్రధాని
 ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు సమైక్య భారతావని గుండెను చీల్చిన కత్తిలాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘30 ఏళ్ల కిత్రం.. దేశ ఐక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జయంతి రోజే సమైక్య భారతావనిని గాయపరిచే సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ 139వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ‘ఐక్యతా పరుగు’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఎందరో అమాయకులు హత్యకు గురయ్యారు. కేవలం ఓ వర్గంపై మాత్రమే జరిగిన దాడిగా నాటి అల్లర్లను పరిగణించలేం. మొత్తం జాతిపై జరిగిన దాడి అది.’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎన్నో అవరోధాలు ఎదురైనా పటేల్‌ జాతిఐక్యత విషయంలో వెనకడుగు వేయలేదని ప్రశంసించారు. చరిత్రను విస్మరించిన జాతి చరిత్రను సృష్టించలేదన్నారు. సంకుచిత ఆలోచనలతో చరిత్రను వక్రీకరించేందుకో.. విభజించేందుకో ప్రయత్నించడం సరికాదన్నారు. ‘స్వామి వివేకానందుని ప్రస్తావన లేకుండా రామకృష్ణ పరమహంస గొప్పతనాన్ని ఊహించగలమా.. అలాగే పటేల్‌ లేకుండా మహాత్మాగాంధీ కూడా అసంపూర్తిగానే కన్పిస్తారు.’ అని వ్యాఖ్యానించారు. పటేల్‌ చాణక్యుడి లాంటి వారని ప్రశంసించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతోపన్యాసంలో.. పటేల్‌ దేశ తొలి ప్రధాని అయితే, దేశ చరిత్ర వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఇతర నేతల గొప్పతనాన్ని తగ్గించడానికి పటేల్‌ జయంతిని నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. ఐక్యతాపరుగును ప్రారంభించిన ప్రధాని కొద్ది దూరం తానూ అడుగులు వేశారు. ప్రముఖ క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, విజేందర్‌ సింగ్‌, పలువురు కేంద్ర మంత్రులు ఐక్యతాపరుగులో పాలుపంచుకున్నారు. కాగా, వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఉపయోగించిన ప్లేట్లు, కప్పులు తదితర వస్తువులను ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ మంజరి ట్రస్ట్‌ నిర్వాహకురాలు షీలా ప్రధాని మోదీకి అందజేశారు. వాటిని అందుకున్న ఆయన భారత సాంస్కృతిక వారసత్వంలో ఇవి ప్రత్యేకమైనవి పేర్కొన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని కరంసద్‌ గ్రామంలో పటేల్‌ ప్రాథమిక విద్యనభ్యసించిన పాఠశాలను ‘సర్దార్‌ స్మృతిశాల’ పేరుతో పటేల్‌ స్మృతిచిహ్నంగా గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందిర వర్ధంతికి మోదీ దూరం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శక్తిస్థల్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకాలేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం గమనార్హం. అయితే, ప్రధాని ట్విట్టర్‌ ద్వారా ఇందిరను గుర్తుచేసుకున్నారు. ‘దేశ ప్రజలందరితో కలిసి ఇందిర గాంధీ సంస్మరణలో భాగస్వామినవుతున్నా.’ అని మోదీ ట్వీట్‌ చేశారు. శక్తిస్థల్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌తోపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment