Thursday 4 September 2014

గురువులు మీకు వందనాలు


గురువులు మీకు  వందనాలు

నాకూ మా అమ్మానాన్నే అన్నివిధాలా ఇంటి గురువులు
పాఠశాల గురువులు, వృత్తి గురువులు, ఉద్యమ గురువులు చాలా మంది వున్నారు.

నాకు ఉర్దూ చదవడం, రాయడం నేర్పింది మా అమ్మ సుఫియాబేగం.
నాకు తెలుగు అక్షరాలు నేర్పిన గురువుగారి పేరు అగ్నిహోత్రావధానులు అనుకుంటాను. వారిని మేము పిలక మాస్టారూ అనేవాళ్ళం.  నరసాపురం ఎంబేరుమన్నారు కోవెల పక్కన వారి ఇల్లు వుండేది. పళ్ళెంలో బియ్యం, కొబ్బరికాయ, తమపాకులు, వక్కలు పెట్టుకుని వాళ్ళింటికి వెళ్ళిన సన్నివేశం ఇప్పటికీ గుర్తుంది. వారికి కోపం చాలా ఎక్కువ. ఆవేశంతో ఊగిపోయేవారు. చాలా పేదరికంలో వుండేవారు. వారికి మగపిల్లలు లేరు. ఆడపిల్లలకు కూడా సరైన దుస్తులు వుండేవికావు.

అదొక సంచార  ఆశ్రమ పాఠశాల. ఉదయాన్నే లేచి, కడుపులో కొంచెం పడేసి, మాస్టారు ఇంటికి పరుగులు తీసేవాళ్ళం. లోపల మాస్టారు స్నానం, పూజలు చేస్తున్నపుడు మేము కుంపటి రాజేసి లంకపొగాకు, సున్నం కలిపి కాల్చి, పొడి చేసి, పలచని గుడ్డతో జల్లెడపట్టి నశ్యం తయారు చేసేవాళ్లం. మాస్టారు వచ్చి నశ్యాన్ని ముక్కులో గట్టిగా దట్టించి, పాఠం మొదలెట్టెవారు. వారి దగ్గర నేను చినబాలశిక్ష పూర్తిచేశాను. పెదబాలశిక్ష కొంత వరకు చదివాను.
మాస్టారూ పాలకొల్లు రోడ్డులో ఇప్పుటి వాటర్ ట్యాంకు ప్రాంతంలో వుండిన మునిసిపల్ స్కూలులో పనిచేసేవారు. మేమూ వారితోపాటు ఆ స్కూలుకు పోయేవాళ్లం. సాయంత్రం స్కూలు అయిన తరువాత మాస్టారు కోటిపల్లి వారి చావిడీలో సంపన్నుల పిల్లలకు పాఠాలు చెప్పేవారు. వారితో పాటూ మేమూ అక్కడికి పోయేవాళ్లం. ఇలా ఉదయం ఆరు నుండి రాత్రి  ఏడు గంటల వరకు కోడి పిల్లల్లా మాస్టారు వెనక తిరిగేవాళ్లం. ఇంటికి రాగానే నిద్ర. ఉదయం లేవగానే మాస్టారు. ఇలా రెండేళ్ళు సాగింది.

ఆ తరువాత టేలరు హైస్కూలు బ్రాంచిలో వేశారు. అక్కడి టీచర్ల పేర్లు నాకు గుర్తులేవుగానీ, ఒక లేడీ టీచరు మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు.

అక్కడి నుండి టేలరుపేట మునిసిపల్ అప్పర్ ప్రైమరీ స్కూలుకు మారాను. పుష్పలత టీచర్ జానపద కథలు, యూసఫ్ మాస్టారి తెలుగు పాఠాలు. నూకల సూర్యనారాయణ మాస్టారి లెక్కలు, శిష్టా సూర్యనారాయణగారి ఇంగ్లీషు, బాపిరాజు మాష్టారి సైన్సు, కృష్ణారావు మాస్టారి సోషల్ నాకు బాగానే వంటపట్టాయి. డ్రిల్లు – కల్చర్ మాస్టారి పేరు గుర్తులేదుగానీ వారి ప్రోత్సాహంతోనే నేను ఆ స్కూలులో రెండు స్కిట్స్ రాసి ప్రదర్శించాను. అవి నా తొలి రచనలు.

ఆ తరువాత మిషన్ హైస్కూలు. అది నా విశ్వవిద్యాలయం. విద్వాన్ పేరి రామారావు గారి తెలుగు, కేఎన్నార్ గారి కాంపోజిట్ మ్యాధమేటిక్స్, సంజీవరావు మాస్టారి ఇంగ్లీషు, జోస్యుల వెంకటేశ్వరరావు గారి కెమిస్టీ, బయాలజీ, భాస్కరరావు మాస్టారి ఫిజిక్సు, జాన్ మాస్టారి మ్యాప్ పాయింటింగ్, బెంజిమన్ మాస్టారి సోషల్ పాఠాలు ఒక జీవిత కాలానికి మరిచిపోయేవి కావు.  

గురువులూ మీకు వందనాలు!! 

No comments:

Post a Comment