Sunday, 3 November 2013

తెలంగాణకు పరిహారమివ్వండి - TRS

తెలంగాణకు పరిహారమివ్వండి

Published at: 04-11-2013 08:11 AM

 New  0  0 

 



అన్ని రకాల నష్టం రూ. 453 లక్షల కోట్లు.. శాసన మండలిని కొనసాగించాలి
కొత్త రాష్ట్రానికి పెద్దల సూచనలు అవసరం.. ప్రస్తుత భవనాల నుంచే తెలంగాణ పాలన
కొత్త రాష్ట్రం చేతికే శాంతి భద్రతలు.. సీమాం«ద్రకు ప్రత్యేక భవన సముదాయం ఇవ్వాలి
రెండేళ్లలో కొత్త రాజధానిలో ఏపీ పాలనకు ఏర్పాట్లు
గోదావరి, కృష్ణాలపై తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులు
బచావత్ ట్రిబున్యల్ నీటి కేటాయింపుల అమలు.. అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం
సింగరేణిలో పూర్తి వాటా తెలంగాణకే.. గ్యాస్ నిక్షేపాల్లోనూ వాటా
4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్‌ప్లాంట్... 1400 మెగావాట్ల గ్యాస్ ప్లాంట్ ఇవ్వాలి
1956కు ముందటి ఆస్తులు మావే.. హైదరాబాద్ హౌజ్‌ని ఇచ్చినందున ఏపీ భవన్ మాకే
తెలంగాణలో 30 శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే
371(డి)ని కొనసాగించాలి.. జీవోఎంకు టీఆర్ఎస్ నివేదిక
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి) రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం(జీవోఎం) విధివిధానాలపై అభిప్రాయాలు కోరుతూ కేంద్రం నుంచి వచ్చిన లేఖపై టీఆర్ఎస్ స్పందించింది. అందులోని 11 అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ నివేదికను పార్టీ రూపొందించింది. దీన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం జీవోఎంకు ఈ-మెయిల్ ద్వారా పంపించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నేతలు ఈ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఒక్కో అంశంపై పార్టీ అభిప్రాయాలను స్పష్టంగా పేర్కొన్నారు.

1.సరిహద్దులు...
కేంద్ర కేబినేట్ ఆమోదించిన నోట్‌లో పేర్కొన్న విధంగానే హైదరాబాద్ శాశ్వత రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలి. జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పును అంగీకరించబోము. 2007లో నిర్వహించిన నియోజకవర్గాల పునర్విభజనలో 10 జిల్లాలను 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించారు. వీటి ఆధారంగానే 2009 ఎన్నికలను నిర్వహించారు. తెలంగాణ ఒక ఆంగ్లో-ఇండియన్‌ను నామినేట్ చేసే అవకాశం ఉన్నందున.. మొత్తం 120 నియోజకవర్గాలవుతున్నాయి. దీంతో శాసన మండలి ఏర్పాటుకు అవసరమైన కనీస ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలోనూ శాసన మండలిని కొనసాగించాలి. కొత్త రాష్ట్రానికి పెద్దల సూచనలు, సలహాలు అవసరమైనందున... తప్పకుండా శాసన మండలిని కొనసాగించాలి.

2.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్...
తెలంగాణ విభజనతో మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. హైదరాబాద్ నగర పరిధిలోని అనుకూలమైన, గౌరవప్రదమైన, విశాలమైన భవనాల సమూహం నుంచి పాలన సాగించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ శాశ్వత రాజధాని అయినందున పాలన మొత్తం హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత భవన సదుపాయాల నుంచే కొనసాగుతుంది. ఈ సదుపాయాలన్నీ 1948 నుంచే ఉన్నాయి.

3.రాజధాని మార్పు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలి. సచివాలయంలోని ముఖ్యమైన విభాగాలు, హెచ్‌వోడీలు, శాసనబద్ధ కార్యాలయాలను వెంటనే అక్కడికి తరలించాలి. కొత్త రాజధానికి అవసరమైన భవన సముదాయాన్ని రెండేళ్లలో నిర్మించాలి. దీంతో సీమాంధ్ర ప్రజలకు రాజధాని చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ నగరం మొత్తం తెలంగాణ రాష్ట్రంతోనే ఉండాలి.

4.వెనుకబడిన ప్రాంతాల అవసరాలు..
తెలంగాణలోని 85 శాతం ప్రజలు చాలా నష్టపోయారు. ఇక్కడి ప్రజల్లో నిరక్షరాస్యత, పోషకాహార లోపం ఎక్కువ. సాగునీరు, విద్యుత్తు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావాలంటే చాలా డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులపై రెండు భారీ జాతీయ నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టాలి. ఇదివరకే మంజూరైన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 'బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్(బీఆర్‌జీఎఫ్)' కింద తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలుగా కేంద్ర ప్రణాళిక సంఘం గుర్తించిన ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సరిపడా నిధులు కేటాయించాలి.

5.శాంతిభద్రతలు, రక్షణ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అహింసా మార్గంలో కొనసాగుతోంది. ఉద్యమంలో ఇప్పటివరకు ఒక్క సీమాంధ్ర వ్యక్తిపైనా దాడి జరగలేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తెలంగాణలో శాంతిభద్రతలను బాగానే నిర్వహిస్తూ వస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం, మత ఘర్షణలను చాలా సున్నితంగానే నియంత్రించారు. అందుకే శాంతిభద్రతల నిర్వహణ ఇకముందు కూడా తెలంగాణ రాష్ట్ర చేతిలోనే ఉండాలి. 1953లో ఆం«ధులు, తమిళులు, 1960లో మరాఠీలు, గుజరాతీలు విడిపోయేటప్పుడు ఇలాంటి ఉద్రేకపూరిత పరిస్థితులే నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం భద్రత, రక్షణ పేరిట ఎలాంటి పరిపాలనాపరమైన అధికారాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తన చేతుల్లోకి తీసుకోలేదు. 28 రాష్ట్రాల ఏర్పాటు సందర్భాల్లోనూ అలాగే జరిగింది. అందుకే తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానాన్నే అవలంభించాలి. ఇక ప్రస్తుత హైకోర్టు బెంచ్‌లు, బార్ కౌన్సిల్, చివరకు కక్షిదారుల్లోనూ నిట్టనిలువుగా విభజన వచ్చేసింది. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు స్వతంత్ర హైకోర్టులను ఏర్పాటు చేయాలి. తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయాలి.

6.వనరుల పంపకం...
కృష్ణా, గోదావరి నీటి వినియోగం దృష్ట్యా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలంటూ 1955లో ఫజల్ అలీ కమిషన్ సూచించింది. అయినా ఫజల్ అలీ ఎస్సార్సీ సిఫారసును పక్కకు పెట్టి రెండు ప్రాంతాలను విలీనం చేశారు. అయితే ఈ 57 ఏళ్ల కాలంలో తెలంగాణకు సమకూరింది 12.5 లక్షల ఎకరాల ఆయకట్టే. ఇందులో 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కిందే ఉంది. అంటే మిగతా 8 లక్షల ఎకరాలకే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందుతోంది. పైగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటే ఎక్కువ మొత్తంలో నీటి సదుపాయం పొందేదంటూ 1976లో బచావత్ కమిటీ అభిప్రాయపడింది. కృష్ణా ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సమకూరే 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు 298 టీఎంసీలు చెందాలని కమిటీ నిర్దేశించింది. గోదావరి ద్వారా సమకూరే 1,480 టీఎంసీలలో తెలంగాణకు 900 టీఎంసీలు చెందాలని తీర్పునిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పులను సమ్మతిస్తుంది. ఎలాంటి సర్దుబాట్లు లేకుండా బచావత్ అవార్డు ప్రకారం న్యాయపరమైన నీటి కేటాయింపులు తెలంగాణలో కొనసాగాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా మరో 190 టీఎంసీల నీరు పొందే హక్కు ఉంటుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సూచనప్రాయంగా అభిప్రాయపడింది. దీనిని ఆసరాగా చేసుకుని పాలకులు.. రివర్ బేసిన్‌లోకి రాని ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్రిబ్యునల్ చివరి తీర్పును అబయెన్స్(తాత్కాలిక నిలిపివేత)లో పెట్టాలి. పర్యావరణ, వణ్యప్రాణులు, పునరావాసం, పునర్నిర్మాణం, గిరిజనుల సమస్యలన్నింటినీ పరిష్కరించాకే పోలవరం ప్రాజెక్టును చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 51:49 నిష్పత్తిన సింగరేణి కంపెనీలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో కంపెనీపై మొత్తం పెత్తనం తెలంగాణ రాష్ట్రానికే ఉండాలి. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్ నిల్వల్లో తెలంగాణకు తగిన వాటా ఇవ్వాలి.

7.విద్యుత్ పంపిణీ..
తెలంగాణలో చేపట్టాల్సిన దాదాపు 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరో 4,617 మెగావాట్ల ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు డిమాండ్ ఉంది. ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను చేపట్టాలి. దీనికి స్థానికంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు లింకేజీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిసా, చత్తీస్‌గఢ్‌లలో కేటాయించిన కోల్ బ్లాక్‌లలో 60 శాతాన్ని కేవలం తెలంగాణకే ఇవ్వాలి. శంకర్‌పల్లి ప్లాంట్‌కు ఫెర్టిలైజర్ స్టేటస్ ఇచ్చి 1,400 మెగావాట్ల సహజవాయువు ఆధారిత ప్లాంట్‌ని చేపట్టాలి.

8.ప్రభుత్వ ఆస్తుల పంపిణీ...
ప్రభుత్వ ఆస్తులను అవి ఉన్న ప్రదేశాల ఆధారంగా, నిర్వహణ స్థలాల ఆధారంగా కేటాయింపులు జరపాలి. ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలను ఏ ప్రాజెక్టుల కోసమైతే తీసుకున్నామో.. ఆ ప్రాజెక్టుల ఆధారంగా పంపిణీ చేయాలి. 1956 నవంబర్ 1కి పూర్వం తెలంగాణలో ఉన్న స్థిర చరాస్తులను తెలంగాణలోనే ఉంచాలి. వీటిని ఉమ్మడి ఆస్తులుగా భావించడానికి వీలు లేదు. ఇదివరకు ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌజ్‌ను మార్చి 8 ఎకరాల స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ దృష్ట్యా 8 ఎకరాల స్థలంతో పాటు భవన సముదాయాన్ని తెలంగాణకే ఇవ్వాలి.

9.ఉద్యోగుల పంపిణీ...
కేంద్ర ప్రభుత్వం 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీనిప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. కానీ ఇది ఘోర ఉల్లంఘనకు గురైంది. 610 జీవో కూడా సరిగా అమలు కాలేదు. ఫలితంగా స్థానికుల ఉద్యోగుల్లో చాలా మంది సీమాం«ద్రులు వచ్చి చేరారు. ప్రస్తుతం తెలంగాణలో 30 శాతం ఉద్యోగులు సీమాం«ద్రులే. రాష్ట్రంలో 376 మంది ఐఏఎస్‌లలో 27 మంది మాత్రమే తెలంగాణ కేడర్ వారున్నారు. 258 మంది ఐపీఎస్‌లలో 20 మంది, 149 మంది ఐఎఫ్ఎస్ అధికారుల్లో 15 మంది మాత్రమే ఇక్కడి వారున్నారు. ఈ దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులను ఈ ప్రాంతానికి బదిలీ చేయాలి. ప్రస్తుతం తెలంగాణ నుంచే ఎక్కువ మంది పెన్షన్లు పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే 92,302 మంది ఉన్నారు. ఈ దృష్ట్యా ప్రతి పెన్షనర్ కేసును పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.

10.371(డి)...
కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 371(డి) ఆర్టికల్‌ను కొనసాగించాలి. కేవలం సవరణతో సరిపుచ్చి.. ఆర్టికల్‌ను యథావిధిగా కొనసాగించాలి. విభజనతో ఉద్యోగుల పంపిణీలో ఎలాంటి నష్టం ఉండనందున.. ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు అక్కడే పని చేస్తారు.

11.ఇతర విషయాలు...
1956 నుంచి తెలంగాణ ప్రాంతం చాలా విధాలుగా నష్టపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగింది. ఫలితంగా తెలంగాణకు రూ. 4.10 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. సాగునీటి ప్రాజెక్టులు కల్పించకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గి ఈ ఆర్థిక నష్టం రూ. 4,53,392 కోట్లకు ఎగబాకింది. ఈ దృష్ట్యా తెలంగాణకు నష్టపరిహార ప్యాకేజీని ప్రకటించాలి.

- See more at: http://www.andhrajyothy.com/node/19945#sthash.1IhT0lRT.dpuf

జీవోఎంకు 11 అంశాలను నివేదించిన టీఆర్ఎస్

Published at: 03-11-2013 19:11 PM

 New  0  0 

 



హైదరాబాద్, నవంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ఎస్) 11 అంశాలతో కూడిన నివేదికను గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)కు ఆదివారం అందజేసింది. విభజన సమయంలో జిల్లాలు, నియోజకవర్గాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని, కేబినెట్‌ తీర్మానం ప్రకారమే తెలంగాణ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రకు రాజధానిని త్వరగా నిర్ణయించాలని, రెండేళ్లలో అక్కడి రాజధానికి అన్ని వసతులు కల్పించాలని, తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ తెలంగాణకే అప్పగించాలని టీఆర్ఎస్ పేర్కొంది.
గోదావరి, కృష్ణా నదులపై జాతీయ ప్రాజెక్ట్‌లను కట్టాలని, ఐఐఎం, ఐఐఎంఎస్‌, నేషనల్‌ ట్రైబల్‌ వర్సిటీలు నిర్మించాలని, సీమాంధ్ర రాష్ట్రానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తూ, ఆ విషయాన్ని విభజన బిల్లులో ప్రస్తావించాలని, బచావత్‌ అవార్డు ప్రకారం తెలంగాణకు రావాల్సిన న్యాయపరమైన నీటివాటాను భవిష్యత్‌లోనూ వినియోగించుకుంటామని టీఆర్ఎస్ పేర్కొంది.
మద్రాసు నుంచి ఆంధ్రా రాష్ట్రం, బొంబాయి నుంచి గుజరాత్‌ విడిపోయినప్పుడుగానీ తదనంతరం 28 రాష్ట్రాలు ఏర్పడినప్పుడుగానీ శాంతి భద్రతలపేరుతో ఏదో ఒక ప్రాంతాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోలేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ అదే వైఖరి అవలంబించాలని, తెలంగాణ రాష్ట్ర వాదన వినిపించేంత వరకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇవ్వబోయే ఫైనల్‌ అవార్డును నిలుపుదల చేయాలని టీఆర్ఎస్ పేర్కొంది.
పోలవరం విషయంలో పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ గిరిజనుల పునరావాసాలపై ఒడిశా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ లేవనెత్తే అంశాలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, సింగరేణిలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నవాటాను తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని, విద్యుత్‌ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్నిపూడ్చాలని, కృష్ణా, గోదావరి బేసిన్‌లో లభ్యమవుతున్నసహజవాయువు, చమురులలో కొంతవాటాను ఇవ్వాలని టీఆర్ఎస్ పేర్కొంది.
స్థానికంగా లభ్యమవుతున్న బొగ్గు ఆధారంగా ఎన్‌టీపీసీ నేతృత్వంలో 4వేల మెగావాట్ల అల్ట్రామెగా పవర్‌ప్లాంట్‌ను తెలంగాణ  రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో కొత్తగా కేటాయించిన బొగ్గు గనుల్లో 60శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని, వ్యవసాయ అవసరాల కోసం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 1400 మెగావాట్ల సహజవాయువు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాని, 1956కు ముందు తెలంగాణలో ఉన్న స్థిర, చర ఆస్తులను తెలంగాణకే కేటాయించాలని టీఆర్ఎస్ పేర్కొంది.
ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌, 8 ఎకరాల స్థలం, భవనం తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల్లో 30శాతం సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో పనిచేస్తున్నారని, స్థానికత ఆధారంగా పెన్షనర్లను విభజించాలని, ఆర్టికల్‌ 371డిలో కొత్తరాష్ట్రం పేరును చేర్చి, దాన్ని యథావిధిగా కొనసాగించాలని, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిన దృష్ట్యా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని టీఆర్ఎస్ ఆ నివేదికలో పేర్కొంది.
- See more at: http://www.andhrajyothy.com/node/19719#sthash.sHZCK6vj.dpuf

'సర్దార్' వారసత్వం

'సర్దార్' వారసత్వం

Published at: 01-11-2013 08:51 AM
 New  0  0 
 
 

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఎత్తుగా (597 అడుగులు) భారత తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి గుజరాత్‌లో శంకుస్థాపన జరిగింది. స్వాతంత్య్రోద్యమ సమయంలోనూ, అనంతరం జాతి నిర్మాణంలోనూ కచ్చితమైన నిర్ణయాలను దృఢ సంకల్పంతో అమలుచేసిన 'ఉక్కుమనిషి'గా ప్రఖ్యాతి గాంచిన సర్దార్ పటేల్ జయంతి నాడు 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' (ఐక్యతా శిల్పం) పేరుతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నర్మద డ్యామ్‌కు అభిముఖంగా, సాధు బెట్ అనే రాతి ద్వీపం వద్ద 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు (ఐక్యతా శిల్పం) సర్దార్ పటేల్‌కు ఘనమైన నివాళిగా ప్రసిద్ధికెక్కనుంది.
గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కదం తొక్కుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ ప్రతిష్ఠను తన లక్ష్య సాధనకు ఆలంబన చేసుకుంటున్నారు. ఆ రకంగానైనా భారత నిర్మాతగా పటేల్ సేవలు నేటి తరానికి పరిచయం కావడం ఆహ్వానించదగినదే. అయితే గుజరాతీ సింహంగా, మొండి పట్టుదలకు, కఠినమైన ఏకపక్ష నిర్ణయాలకు మారుపేరైన ఉక్కుమనిషిగా, మైనారిటీల గొంతెమ్మ కోర్కెలను వ్యతిరేకిస్తూ మెజారిటీల ఆత్మగౌరవాన్ని సంరక్షించిన విలక్షణ లౌకికవాదిగా ప్రచారం చేయడం చారిత్రక తప్పిదమవుతుంది. మోదీ తనలోని గుజరాతీయత, భావజాల ఛాయలను పటేల్‌కు ఆపాదించడం సమంజసం కాదు. ఆ విధంగా తమకు సైతం జాతీయోద్యమ మూలాలు ఉన్నట్లు «ద్రువీకరించబోవడమే కాక, తమపై పడిన ముద్రలను వదిలించుకునేందుకు సంఘ పరివార్ ప్రయత్నం చేస్తోంది.
ఆర్థిక సంక్షోభం, పాలనావైకల్యం, ప్రధాన స్రవంతి రాజకీయార్థిక విధానాలకు పోటీగా ప్రత్యామ్నాయ, సమగ్ర భావజాలం ధీటుగాలేని దుస్థితి నేడు దేశంలో నెలకొనింది. వీటికి తోడు సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతి సమగ్రతకు, ఉక్కు సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ వారసత్వం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) పోట్లాడుకుంటున్నాయి. అయితే జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్‌లో మితవాదిగా, మెజారిటీ ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న సర్దార్ పటేల్ ఆచరణ ప్రాంతీయతకు, నిర్దిష్ట సామాజిక అస్తిత్వానికి అతీతంగా నిలిచింది. దేశంలోని కుల, మత, వర్గ, జాతి, లింగ అస్తిత్వాల సంక్లిష్టతలకు అనుగుణంగా తన కార్యాచరణను మలుచుకున్న పటేల్ వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రించబోవడం ఇరు పార్టీలకు తగదు. వైవిధ్యపూరిత అస్తిత్వాలకు, సంక్లిష్టతలకు వేదికగా ఉన్న జాతీయోద్యమ కాలంనాటి కాంగ్రె స్‌కు, ఈనాటి కాంగ్రెస్‌కు పోలికే లేదన్నది నిజమే. జాతీయ రాజ్య నిర్మాణ ఆకాంక్షతో దృఢ సంకల్పంతో వ్యవహరించిన పటేల్ వ్యక్తిత్వానికి సంఘ పరివార్ భావజాల, వ్యవహార శైలికి ఏమాత్రం సారూప్యం లేదు. సర్దార్ పటేల్ వారసత్వం ఇటు కాంగ్రెస్‌కుగానీ, అటు సంఘపరివార్‌కు గానీ చెందినది కాదు. ఆయన భారత ప్రజానీకం అందరి నేత.
స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీకి నమ్మకమైన కుడి భుజంగా నిలవడమేకాక, దేశ తొలి ఉప ప్ర«ధానిగా, తొలి హోం మంత్రిగా సర్దార్ పటేల్ గణనీయమైన పాత్ర పోషించారు.
స్వత్రంత్ర భారత ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హత కల్పించే 1946నాటి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి పటేల్‌ను మెజారిటీ కమిటీలు ఎన్నుకున్నాయి. పట్టుదలకు మారుపేరుగా పేరున ్న పటేల్ మహాత్ముని సూచన మేరకు నెహ్రూకు ఆ పదవిని కట్టబెట్టి తాను తప్పుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ముస్లిం ప్రజానీకం మెజారిటీగా ఉన్న భౌగోళక ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న మహమ్మద్ ఆలి జిన్నా నాయకత్వంలోని ఉద్యమాన్ని గుర్తించి దేశ విభజనను అంగీకరించిన కాంగ్రెస్ నేత పటేల్ కావడం విశేషం. విభజన సమయంలో జరిగిన మారణహోమం, లక్షలాది మంది హిందువులు సరిహద్దులు దాటుకొని వచ్చిన సందర్భంలో వారికి పునరావాసం, రక్షణ కల్పించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఆయనపై హిందూ పక్షపాతి ముద్ర పడింది. జర్మన్ ఏకీకరణను పట్టుదల సాధించి ఉక్కుమనిషిగా పేరుపొందిన బిస్మార్క్ వలె పటేల్ కూడా స్వాతంత్య్రానంతరం 562 రాజరిక సంస్థానాలను భారత ప్రజాతంత్ర రిపబ్లిక్‌లో విలీనమయ్యేందుకు కృషి చేసి భారత జాతుల సమాఖ్య అవతరణకు కృషి చేశారు. హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్ రాజ్యాలు మినహా మిలిగిన సంస్థానాలు శాంతియుతంగా విలీనం కావడంలో ఆయన కృషి అనితర సాధ్యం. అయితే హైదరాబాద్ సంస్థానం విలీనంపై దౌత్యపరమైన ప్రయత్నాలు బెడిసి కొట్టి, సమస్య అంతర్జాతీయ స్థాయికి చేరడంతో అనివార్య పరిస్థితుల్లో ఆయన సైనిక చర్యకు పాల్పడ్డారు.
గాంధీ హత్యానంతరం 1948 సెప్టెంబర్‌లో ఆరెస్సెస్‌ను ఆనాటి హోం మంత్రి పటేల్ నిషేధించినా, రాజకీయాలతో జోక్యం చేసుకోబోమన్న హామీ తీసుకొని ఆ సంస్థపై నిషేధాన్ని తొలగించారు. పైకి మితవాదిగా కనిపించిన పటేల్ ఈ చర్యతో దేశ రాజకీయాలు మతతత్వంతో విభజితం కావడాన్ని నిలువరించినట్లయింది. దాంతో ఆరెస్సెస్ సంస్థ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా, తొలుత జనసంఘ్, ఆ తర్వాత బీజేపీలకు మార్గదర్శకత్వం వహించే పాత్రను పోషించింది. అనేక రాజకీయ నిర్ణయాల్లో ఆయన నెహ్రూ, గాంధీలను వ్యతిరేకించి మెజారిటీలకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించినట్లు కనిపించినా ఆయన నిర్ణయాలు అనేకం దీర్ఘకాలిక ఫలితాలనిచ్చాయి. బీజేపీ 'మెజారిటీ లౌకికవాదం', కాంగ్రెస్ 'మైనారిటీ లౌకికవాదం' కంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరుచేసిన పటేల్ లౌకికవాదం భిన్నమైనది.
- See more at: http://www.andhrajyothy.com/node/19257#sthash.WJB7F8Fa.dpuf

మతతత్వమూ, ఉగ్రవాదమూ

మతతత్వమూ, ఉగ్రవాదమూ

Published at: 01-11-2013 06:54 AM
 New  0  0 
 
 

మోదీ ఎప్పుడైనా సిటిజన్‌నగర్‌ను సందర్శించారా? రాహుల్ ఎప్పుడైనా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం సమకూర్చేందుకు పోరాడారా? కాశ్మీరీ పండిట్‌ల వెతలు తీర్చడానికి ఒమర్ అబ్దుల్లా శ్రద్ధ చూపుతారా? ముజాఫర్‌నగర్‌లో నిరాశ్రయులైన వారికి అఖిలేశ్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా? బహుశా ఈ ప్రశ్నలు ఎక్కడా చర్చకు వచ్చే అవకాశం లేదేమో? ఎందుకంటే మతోన్మాద హింసాకాండ బాధితులకు పునరావాసం కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు.
ఇరవై ఏడేళ్ళనాటి మాట. షార్జాలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. పాక్ జట్టుపై విజయం సాధిస్తే టోయోటా కార్ల్లు బహూకరిస్తానని మాఫియాడాన్ ఒకరు మన క్రికెటర్లకు ప్రతిపాదించాడు. 1986లో భారత క్రికెట్ జట్టుపై ఇంత అభిమానం చూపిన ఇదే వ్యక్తి 1993లో కరాచీ నివాసి అయ్యాడు. చెప్పవలసిన విషయమేమిటంటే అతడు భారతదేశపు 'మోస్ట్ వాంటెడ్' క్రిమినల్! ఎందుకిలా జరిగింది? 1980వ దశకంలో చాలామంది భారతీయ టెస్ట్‌క్రికెటర్లు వ్యక్తిగత సంభాషణల్లో ధ్రువీకరించిన విషయాన్నే మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కొద్దిరోజుల క్రితం బహిరంగంగా వెల్లడించారు (ఆ తరువాత, ఆయన తాను అలా చెప్పలేదని నిరాకరించారనుకోండి, అది వేరే విషయం). దావూద్ ఇబ్రహీం తన జీవితంలో ఒక దశలో భారతీయ క్రికెట్ జట్టుకు ప్రగాఢాభిమాని.
1993 ముంబై పేలుళ్లు సంభవించిన కొద్ది రోజులకే ఈ కాలమిస్ట్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో రాసిన ఒక వ్యాసంలో ఇదే విషయాన్ని చెప్పినందుకు పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ పేలుళ్ళను 'ముస్లిమ్ కుట్ర'గా దేశవ్యాప్తంగా ఎంతోమంది భావించారు. వాటి వెనుక దావూద్ ఇబ్రహీం హస్తముందని విశ్వసించారు. ఒక మైనారిటీవర్గం వారి దేశభక్తిని అనుమానించారు. భారతీయ ముస్లిమ్‌ల 'దేశభక్తి'కి నిజమైన పరీక్ష ఏమిటో శివసేన అధినేత బాల్‌థాకరే చెప్పనే చెప్పారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఊపిన ముస్లిమ్ మాత్రమే నిజమైన భారతీయుడట! ఎంత అసంబద్ధం. ఇలా అయితే షార్జాలో భారత్ జట్టుకు మద్దతిచ్చిన దావూద్‌ను మించిన భారతీయ దేశభక్తుడు ఎవరుంటారు? ఇదే విషయాన్ని నా 'టైమ్స్' వ్యాసంలో ప్రస్తావించాను.
రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనివున్నప్పుడు మైనారిటీ వర్గం వారి దేశభక్తికి అలా 'యోగ్యతాపత్రాలు' ఇవ్వడంలో చాలా ప్రమాదాలున్నాయని నేను పేర్కొన్నాను. నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక బహిరంగసభలో బాల్ థాకరే నాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నన్ను హతమారుస్తామని కొంతమంది బెదిరించారు. నాకు పోలీసు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. బీజేపీ ఎంపీ ఒకరు పార్లమెంటులో ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ఆ వ్యాసం ' జాతి-వ్యతిరేకమని' ఆ ఎంపీ అభివర్ణించాడు. ఈనాటికీ హిందుత్వ శ్రేణులు ఆనాటి నా వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటాయి. దావూద్ భారత్ వ్యతిరేకి అయినప్పటికీ అతడు 'జాతీయవాది' అని నేను వాదించానని హిందూత్వ శ్రేణులు నన్ను తీవ్రంగా ఆక్షేపిస్తుంటాయి.
నా వాదనలోని మౌలిక ప్రశ్నలను గుర్తించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. 1992 అక్టోబర్-నవంబర్, 1993 మార్చ్‌కు మధ్య ఏమి జరిగింది? 1992 తుదినాళ్ళలో భారత క్రికెట్ మద్దతుదారుగా ఉన్న దావూద్ కేవలం నాలుగునెలల్లోనే బాల్యం నుంచి తాను పెరిగిన నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించడానికి ఎందుకు ప్రయత్నించాడు? అతనిలో ఇటువంటి ఘోరమైన మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పటికీ ఈ ఇబ్బందికరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు (ఒక్క అనురాగ్ కాశ్యప్ మాత్రమే, జర్నలిస్ట్ హుస్సేన్ జైడీ గ్రంథం ఆధారంగా తాను రూపొందించిన 'బ్లాక్ ఫ్రైడే' సినిమాలో ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు). స్మగ్లింగ్, కాంట్రాక్ట్ హత్యలే వృత్తిగా ఉన్న వ్యక్తి దావూద్. అతని అనుచరులలో చాలా మంది హిందువులు ఉండేవారు. అటువంటి వ్యక్తి తన డి-కంపెనీని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వెన్నుదన్నుతో 'ముస్లింలు మాత్రమే' ఉండే ఉగ్రవాద ముఠాగా ఎందుకు మార్చివేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992 డిసెంబర్‌లోనూ, 1993 జనవరిలోనూ చోటుచేసుకున్న సంఘటనలలో లభించవచ్చు. ఆనాటి మతతత్వ అల్లర్లతో ముంబై విశ్వజనీన సంస్కృతికి తీవ్ర విఘాతం కలిగింది.
మతతత్వ అల్లర్ల నేపథ్యంలో, మనం ఎదుర్కోడానికి సిద్ధంగా లేని ఇతర ఇబ్బందికరమైన సత్యాలు చాలా ఉన్నాయి. 1984లో ఢిల్లీ, ఇతర ఉత్తరాది నగరాల్లో వేలాది సిక్కుల ఊచకోత ఆ తరువాత ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీయలేదా? 2002 గుజరాత్ మారణకాండ, ఇండియన్ ముజాహిదీన్ ఇత్యాది ఉగ్రవాద బృందాల ఆవిర్భావానికి కారణం కాలేదూ? హింస హింసకు మాత్రమే దారితీస్తుంది. మతం పేరి ట జరిగే అనాగరిక కార్యకలాపాలకు అదే విధమైన ప్రతి చర్యలుంటాయి.
ఇది సత్యం. రాహుల్ గాంధీ తన ఇండోర్ ప్రసంగంలో బహుశా ఈ సత్యాన్నే సూచనప్రాయంగా చెప్పారని భావించవచ్చు. ముజాఫర్‌నగర్ అల్లర్ల అనంతరం పది నుంచి పదిహేను మంది ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకోవడానికి ఐఎస్ఐ ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారని ఆయన ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. మతతత్వ అల్లర్లు, ఉగ్రవాదం మధ్య సంబంధమున్నదన్న నిర్ణయానికి రావడంలో ఆయనకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండి ఉంటుంది. అయితే రాహుల్ పాత్రికేయుడు కాదు. హింసాకాండ మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే విశ్లేషకుడూ కాదు. ఆయన రాజకీయ వేత్త. కాంగ్రెస్‌కు కాబోయే అధినేత. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటను అత్యంత జాగ్రత్తగా మాట్లాడవలసి వుంటుంది.
నిర్దిష్ట రుజువులు చూపకుండా ముజాఫర్ నగర్ ముస్లిమ్ యువకులను 'శత్రువు' తన వైపుకు ఆకట్టుకున్నారని చెప్పడం అక్కడ చోటుచేసుకున్న అల్లర్ల బాధితులను 'అనుమానాస్పద వ్యక్తులు'గా పరిగణించడమే అవుతుంది. మరింత శోచనీయమైన విషయమేమిటంటే భారతీయ ముస్లింల దేశభక్తిని పదేపదే ప్రశ్నించే వారి అనుమానాలను ధ్రువీకరించడమే అవుతుంది. మతతత్వ అల్లర్ల అనంతరం ముజాఫర్‌నగర్‌లో పరిస్థితులేమిటి? అక్కడి వాస్తవాలు రాజకీయ రణరంగంలోని పరిణామాలకు చాలా భిన్న ంగా ఉన్నాయి. ఆ అల్లర్లు సంభవించిన పలు వారాల తరువాత కూడా వందలాది బాధిత కుటుంబాలు సహాయ శిబిరాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నాయి. చాలామంది తిరిగి తమ స్వస్థలాలకు, స్వగృహాలకు వెళ్ళేందుకు భయపడుతున్నారు. వారి పరిస్థితి, ఒక విధ ంగా, మరే మతతత్వ అల్లర్ల బాధితుల పరిస్థితి కంటే భిన్నమైనది కాదు.
2002 గుజరాత్ అల్లర్ల బాధితులను కలుసుకోవడానికి అహ్మదాబాద్ శివారు ప్రాంతం నుంచి సిటిజన్‌నగర్‌కు వెళ్ళండి. ఆ బాధితులు చెత్త కుప్పల పక్కన నివశించడం మీరు చూస్తారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో చనిపోయిన వారి వితంతువులు తిలక్‌విహార్‌లో పొంగిపొర్లే మురికికాల్వల ప్రాంతాలలో నివశిస్తున్నారు. జమ్మూలో తాత్కాలిక సహాయ శిబిరాలలో తలదాచుకొంటున్న కాశ్మీరీపండిట్‌ల పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. దుర్భరబతుకులే ఈ భిన్నవర్గాల వారి మధ్యనున్న ఉమ్మడి అంశం. ప్రజలకు చట్టబద్ధ పాలనను సమర్థంగా అందించడంలో భారత రాజ్య వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తున్న వాస్తవమిది. ముస్లింలు, సిక్కులు లేదా హిందువులు కావడం వల్లే వారికి ఇలాంటి పరిస్థితులు దాపురించలేదు. తన సొంత ప్రజలకు రక్షణ కల్పించి వారికి న్యాయం సమకూర్చలేని సమాజం గురించిన వాస్తవమిది.
నరేంద్ర మోదీ ఎప్పుడైనా సిటిజన్‌నగర్‌ను సందర్శించారా? లేక అది గుజరాత్ భౌగోళిక పటం నుంచి జారిపోయిందా? రాహుల్ ఎప్పుడైనా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం సమకూర్చేందుకు పోరాడారా? కాశ్మీరీ పండిట్‌ల వెతలను తీర్చడానికి ఒమర్ అబ్దుల్లా శ్రద్ధ చూపుతారా? ముజాఫర్‌నగర్‌లో నిరాశ్రయులైనవారికి అఖిలేశ్ ప్రభు త్వం రక్షణ కల్పిస్తుందా? బహుశా ఈ ప్రశ్నలు ఎక్కడా చర్చకు వచ్చే అవకాశం లేదేమో? ఎందుకంటే మతోన్మాద హింసాకాండకు బాధితులకు పునరావాసం కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ఒక రాజకీయ పక్షం గుండెలు బాదుకుంటే 2002 గుజరాత్ మారణకాండ గురించి మరో రాజకీయ పక్షం కన్నీళ్లు కుమ్మరిస్తుంది. ఇబ్బందికరమైన వాస్తవాలను ఎదుర్కోవడం కంటే ఇలా వ్యవహరించడం చాలా సులువు కదా మరి.
(ఆం«ధ్రజ్యోతికి ప్రత్యేకం)
- See more at: http://www.andhrajyothy.com/node/19020#sthash.3PGCFJFI.dpuf

Saturday, 2 November 2013

తేల్చాల్సినవి ఇవే!

తేల్చాల్సినవి ఇవే!

Published at: 30-10-2013 08:18 AM
 New  0  0 
 
 

మంత్రుల బృందానికి కేంద్ర హోం శాఖ నివేదిక
కీలకంగా నీళ్లు, క రెంటు,371(డి), హైదరాబాద్
జలవనరులపై చట్టబద్ధమైన నిర్వహణ మండలి
విద్యుత్ పై ఏకాభిప్రాయానికి రాకుంటే కేంద్రం జోక్యం
371(డి) అధికరణకు సవరణ లేదా రద్దు తప్పదు
హైదరాబాద్, సీమాంధ్ర రాజధానిపై సమగ్ర వివరణ
బిల్లులోనే కేటాయింపుల ప్రస్తావన
న్యూఢిల్లీ , అక్టోబర్ 29:జల వనరులు, విద్యుత్తు, 371 (డి) అధికరణ, హైదరాబాద్... ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారంలో ఇవి నాలుగు కీలకమైన అంశాలని కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఇదే విషయాన్ని మంత్రుల బృందానికి (జీవోఎం) కూడా స్పష్టం చేసింది. 'పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవే' అని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వాపరాలు, సమగ్ర వివరాలతో హోంశాఖ ఒక నివేదికను రూపొందించి... 'తగిన నిర్ణయాల' కోసం దానిని మంత్రుల బృందానికి సమర్పించింది. ఈ నివేదికను 'ఆంధ్రజ్యోతి' సంపాదించింది. అత్యంత కీలకమైన జల, విద్యుత్ వనరులు, హైదరాబాద్ నగరం, 371(డి)లపై అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మంత్రుల బృందమే! అయితే, వీటిలో కొన్ని అంశాలపై హోంశాఖ తనదైన ప్రతిపాదనలు చేయడం గమనార్హం.
నీటిపై 'స్వతంత్ర' బోర్డు!
రాష్ట్ర విభజన అనంతరం... కృష్ణా, గోదావరి నదులు, ఇతర నదీ పరివాహక ప్రాంతాల పర్యవేక్షణకు చట్టబద్ధమైన అధికారాలతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న జల యాజమాన్య బోర్డును ఏర్పర్చడం సముచితంగా ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ తన నోట్‌లో సూచించింది. రాష్ట్రంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల గురించి వివరించింది. ఆయా నదులపై ఏర్పడిన ట్రిబ్యునళ్లు, వివిధ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ గురించి ప్రస్తావించింది.
విద్యుత్తు పంపిణీ ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం ఎంత? అందులో థర్మల్ వాటా ఎంత? ఏ ప్రాంతంలో ఏయే ప్లాంట్లు ఉన్నాయి? అనే గణాంకాలను హోంశాఖ తన నోట్‌లో సవివరంగా పేర్కొంది. విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణల గురించి వివరించింది. "విద్యుత్తు పంపకంపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోతే... ఈ విషయాన్ని భారత ప్రభుత్వం తేల్చుతుంది. ఇదే విషయాన్ని బిల్లులో చెబుతారు'' అని కేంద్ర హోంశాఖ తన నివేదికలో తెలిపింది.
371(డి) కీలకం...
రాష్ట్ర విభజన వ్యవహారంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది... ఆర్టికల్ 371 (డి). ఈ అంశానికి కేంద్ర హోంశాఖ తన నివేదికలో కీలక ప్రాధాన్యం ఇచ్చింది. 371 (డి) అధికరణ పుట్టుపూర్వోత్తరాలు వివరించింది. "రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరు జోన్లుగా విభజించారు. హైదరాబాద్‌ను కొన్ని ఉద్యోగాల కోసం స్థానిక ప్రాంతంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జరుగుతున్నందువల్ల రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల క్రమం కొనసాగే అవ కాశమున్నందువల్ల 371(డి) అధికరణను సవరించడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చాల్సి ఉంటుంది'' అని నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌లో విద్య, ఉపాధికి సంబంధించి ఇతర 'సేఫ్‌గార్డ్స్'ను, ఆర్టికల్ 371(డి) సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుందని పేర్కొంది. "రాష్ట్ర విభజన తర్వాత... మంత్రుల బృందం నిర్ణయం మేరకు 371(డి)ని తగిన విధంగా సవరణ చేయడంకానీ, పూర్తిగా రద్దు చేయడం కానీ చేయాలి'' అని స్పష్టంగా పేర్కొంది.
కొత్త రాజధాని సంగతి..
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని హోంశాఖ పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని భారత ప్రభుత్వమే భరించి, అందుకు సరిపడా నిధుల్ని విభజన బిల్లులోనే కేటాయించాలని సూచించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల ద్వారా సూచించాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్ర విభజన క్రమంలో అయ్యే ఖర్చును కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి విడుదల చేసే అధికారాన్ని రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించాలని సూచించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ కేటాయింపులకు తెలంగాణ అసెంబ్లీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని హోం శాఖ పేర్కొంది. కొన్ని నిధులకు కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులు, ప్రజారుణం, అదనంగా వసూలు చేసిన పన్నుల చెల్లింపు, డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్లు, కాంట్రాక్టుల వంటివి సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించే వెసులుబాటు ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల్లో అంగీకారం కుదరకపోతే... కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని పరిష్కరిస్తుంది.
ఉద్యోగుల వివరాలతో ఢిల్లీకి సీఎస్
రాష్ట్ర ఉద్యోగుల, రాష్ట్ర కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేసేందుకు సీఎస్ మహంతి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజులు ఆయన అక్కడే ఉంటారు. విభజన నేపథ్యంలో ఇరుప్రాం తాల ఉద్యోగుల సంఖ్య, జోన్ల వారీ నియామకాలు, రాష్ట్రస్థాయి నియామకాలు, తదితరాలకు సంబంధించి నివేదికలను తనతో తీసుకెళుతున్నారు. ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగుల వివరాలను హోంశాఖకు సమర్పించనున్నారు. ఉపాధ్యాయుల సంఖ్య, జిల్లా ఎంపిక కమిటీల నియామకాలు.. 610 అమలు.. తర్వాత మిగిలి ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత అన్న దానిపై ఇప్పటికే రూపొందించిన నివేదికలను హోంశాఖకు అందజేయనున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులను అందించనున్నారని సమాచారం. సీఎస్ నివేదికలను ప్రధాని కార్యాలయ శాఖకు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రి నారాయణస్వామితోనూ సీఎస్ సమావేశం కానున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల దృష్ట్యా పరిశీలకులుగా పంపించాల్సిన మన రాష్ట్ర కేడర్ అధికారుల జాబితాను సీఎస్ కేంద్ర ఈసీకి అందజేస్తారు.
పోలవరానికి 16 వేల కోట్లు
అంతర్ రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అన్ని విషయాలపై కేంద్ర ప్రభుత్వమే తగిన ఆదేశాలు జారీ చేసేలా బిల్లు రూపొందుతుంది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను కేంద్రం యథాతథంగా ఆమోదించినట్లు ఈ నివేదిక ద్వారా అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్ల తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వ్యవసాయ, జల విద్యుత్, తాగునీటి అవసరాలు తీరుతాయని, విశాఖపట్నానికి, ఉక్కు కర్మాగారానికి అవసరమైన పారిశ్రామిక జలాలు కూడా సరఫరా అవుతాయని పేర్కొంది. అయితే, పోలవరం వల్ల 277 నివాస ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుందని, ఇందులో 119 పూర్తిగా మునిగిపోతాయని నివేదిక పేర్కొంది. తెలంగాణలో 47 నివాస ప్రాంతాలు పూర్తిగాను, 158 నివాస ప్రాంతాలు పాక్షికంగానూ నీట మునుగుతాయని... దాదాపు 1.75 లక్షల మందిపై ప్రభావం పడుతుందని తెలిపింది. వారి పునరావాసం, జీవనోపాధికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం అవసరమని హోం శాఖ సూచించింది. "పోలవరంవల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందన్నదే తెలంగాణ ప్రజల అభ్యంతరం. అలాగే... గోదావరి జలాలు కోస్తాంధ్ర వ్యవసాయ ప్రయోజనాలకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయన్న ఆందోళన కూడా తలెత్తుతోంది. కేంద్ర జల సంఘం నుంచి ఒడిసా, ఛత్తీస్‌గఢ్ లేవనెత్తిన వివిధ అంశాలపై వివరణ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం దాదాపు 16 వేల కోట్ల రూపాయల మేరకు పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తుంది'' అని హోంశాఖ తెలిపింది.
రాష్ట్ర సమగ్ర స్వరూపం
రాష్ట్ర అర్థ గణాం క శాఖ, ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రణాళికా సంఘం నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ఈ 85 పేజీల్లో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన 20 అనుబంధాలను నివేదికలో చేర్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, అప్పులు, విద్యారంగ పరిస్థితి, జల, విద్యుత్ వనరులు, జనాభా వివరాలు, తలసరి ఆదాయం, పరిశ్రమల స్థితిగతులు, ఎగుమతులు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, వివిధ రంగాల్లో ఉపాధి, అటవీ సంపద, రవాణా, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్ రంగం, ఖనిజ వనరులు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు, కేంద్రం, ప్రణాళికా సంఘం నుంచి లభిస్తున్న నిధులు - గ్రాంటులు, రుణాలు, ఆర్థిక లోటు, వడ్డీ చెల్లింపులు మొదలైన లెక్కలు విప్పారు. వివిధ నదీ జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, పంపిణీ, సరఫరా వివరాలు కూడా తెలిపారు.
హైదరాబాద్ = వ్యాపారం, విద్య, వైద్యం, ఉపాధి
హైదరాబాద్‌ను ఏం చేయాలి? అనే అంశంపై కేంద్ర హోంశాఖ నిర్దిష్టంగా ఎలాంటి ప్రతిపాదన చేయనప్పటికీ... రాజధాని నగర ప్రాధాన్యం గురించి మాత్రం స్పష్టంగా వివరించింది. హైదరాబాద్ అంటే.. వ్యాపారం, విద్య, వైద్యం, ఉద్యోగం అనే నిర్వచనం ఇచ్చింది. హైదరాబాద్‌లోని విద్యాసంస్థల్లో 'లోకల్' అయ్యేందుకు... చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగేళ్లపాటు ఇక్కడ చదివిస్తారని తెలిపింది. "హైదరాబాద్ ఐటీ కేంద్రంగా పేరెన్నికగన్నది. అనేక జాతీయ స్థాయి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు కేంద్రీకృతమైయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సౌకర్యాలు కూడా హైదరాబాద్ మెట్రో ప్రాంతంలో విస్తృతంగా ఉన్నాయి. రాష్ట్ర సగటుకంటే మూడు రెట్లు అధికంగా ఆస్పత్రి పడకలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దేశభద్రతతో ముడిపడిన 28 రక్షణ, ఇతర వ్యూహాత్మక సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి'' అని కేంద్ర హోంశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఈ సంస్థల్లో పని చేస్తున్నారని తెలిపింది. హైదరాబాద్‌లోని విద్యా, పరిశోధన సంస్థల జాబితా కూడా ఇచ్చింది.
ఐదు గ్రూపులుగా నదులు
రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఐదు గ్రూపులుగా విభజించింది. అవి...
1. కృష్ణా, 2. గోదావరి, 3. పెన్నా
4. వంశధార, 5. ఇతర నదీ పరివాహక ప్రాంతాలు
విద్యుదుత్పత్తి (స్థాపిత) సామర్థ్యం (మెగావాట్లు)
తెలంగాణ 4368
రాయలసీమ 1840
కోస్తాంధ్ర 5242
మొత్తం 11450
(ఆంధ్రప్రదేశ్‌కు అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి 148, కేంద్రం వాటా నుంచి మరో 3049 మెగావాట్ల విద్యుత్తు లభిస్తుంది. మొత్తం రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 14,646 మెగావాట్లు. ఇందులో థర్మల్ వాటా 4383 మెగావాట్లు)
పన్నుల గని... రాజధాని
2010-11లో వసూలైన మొత్తం అమ్మకపు పన్ను రూ.34,910 కోట్లు. ఇందులో 74% హైదరాబాద్ నుంచే వసూలైంది. దాన్ని మినహాయించిన తెలంగాణ నుంచి 8%, సీమ నుంచి 3% వసూలుకాగా... కోస్తా వాటా 15%.
ఇంజనీర్ల 'రంగారెడ్డి'
రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా... అందులో 150 రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ప్రాంతాల వారీగా తెలంగాణలో 340, కోస్తాంధ్రలో 268, రాయలసీమలో 102 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.
రెండు రాష్ట్రాలు... ఒక హైకోర్టు!
"ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్‌లో ఉంది. హైకోర్టుకు రాష్ట్రంలో మరెక్కడా ధర్మాసనాలు లేవు. అందువల్ల, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి... తదుపరి ఏర్పాట్లు జరిగే దాకా రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని హైకోర్టును ఉమ్మడిగా ఉంచవచ్చు'' అని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది
- See more at: http://www.andhrajyothy.com/node/17320#sthash.tKIkJomS.dpuf